పాప పుట్టి 14 నెలలు అవుతుంది. శరీర భాగాల్లో చలనం లేదు. తన వయసున్న చిన్నారులు చిన్నచిన్నగా నడవడం మొదలుపెడుతుంటే.. వారి పాప మాత్రం ఇంకా అచేతన స్థితిలో ఉండిపోయింది. మెడ భాగం బలంగా లేదు. ఎందుకిలా అవుతుందనే ఆందోళనలో ఆ తల్లిదండ్రులు వైద్యులను(16 crore for Child Treatment) ఆశ్రయించారు. వారు పరీక్షలు చేశారు. పాప అలా అవడానికి కారణమేంటో డాక్టర్లకూ తెలియలేదు. దీంతో మరికొన్ని ఆస్పత్రులకు తిరిగారు. చివరగా ఒక ఆస్పత్రిలో చేయించిన వైద్య పరీక్షల్లో పాప ఆరోగ్య పరిస్థితేంటో తెలిసింది. తమ బిడ్డకు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ ఉందని వైద్యులు నిర్ధరించారు. ఇది ఒక జన్యు సంబంధిత వ్యాధి. అది విన్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ చిన్నారికి ఇంత పెద్ద వ్యాధి ఉందని తెలిసి.. తట్టుకోలేకపోయారు. ఎలాగైనా వ్యాధి నయం చేయించాలని ఆరాటపడ్డారు. ఇప్పటికే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. కానీ ఆ సమస్య తగ్గాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని వైద్యులు చెప్పారు. జోల్ జీన్ స్మా(zolgensma injection) అనే ఇంజక్షన్ వేయాలని చెప్పారు. దాని విలువ రూ. 16 కోట్లు ఉంటుందని.. ఆ ఇంజక్షన్ వేస్తేనే వారి బిడ్డకు(16 crore for Child Treatment) నయమవుతుందని చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడని తమ బతుకుల్లో లక్షలు చూడటమే అరుదు. ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తేవాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆనందం ఆవిరైంది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుపల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్, స్టెల్లాలకు 2018లో వివాహం జరిగింది. మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మించింది. అల్లారుముద్దుగా బోసినవ్వులు నవ్వుతూ ఉన్న ఆ పాప.. తల్లిదండ్రులకు అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఆ ఆనందబాష్పాలు అంతలోనే కన్నీటిధారలుగా మారిపోయి.. వారికి వ్యథను మిగిల్చింది. 14 నెలల పాప ఎల్లన్(16 crore for Child Treatment) కు నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్ఠంగా తయారవలేదు. మెడ కిందికి వాలిపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. నెలలు గడుస్తున్నా శరీరభాగాల్లో కదలికలు కనిపించలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఏపీలోని విజయవాడలో ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. వ్యాధి నిర్ధరణ కాకపోవడంతో చాలా చోట్ల తిరిగి అనేక పరీక్షలు చేయించారు. ఈనెల 13న వచ్చిన నివేదికలో జన్యు సంబంధిత వ్యాధి స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీగా వైద్యులు గుర్తించారు.
రోజుకు రూ. 25వేలు ఖర్చు
అప్పటికే పాప నరాలు, కండరాలు బలహీనంగా మారాయని.. వైద్యం(16 crore for Child Treatment) అందకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని డాక్టర్లు తెలిపారు. రానురాను చిన్నారి శరీరభాగాల్లో కదలికలు తగ్గడంతో తల్లిదండ్రులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. చికిత్సకు రోజుకు రూ. 25 వేలు ఖర్చవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.
సాయం కోసం ఎదురుచూపు
ఒక ప్రైవేటు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్న ప్రవీణ్.. పాప వైద్యానికి రోజుకు రూ. 25 వేలు ఖర్చు చేస్తున్నారు. దొరికిన ప్రతి చోటా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. కానీ అదంతా అప్పటి వరకు ఉపశమనం మాత్రమే. అయితే ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే అమెరికా నుంచి జోల్ జీన్ స్మా(zolgensma injection) ఇంజక్షన్ తెప్పించాలని డాక్టర్లు తెలిపారు. ఆ ఒక్క ఇంజక్షన్ విలువ రూ. 16 కోట్లు ఉంటుందని చెప్పారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. ప్రభుత్వం కానీ, దాతలు కానీ సహాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: ప్రేమపెళ్లి చేసుకున్నందుకు ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు..!