తెలంగాణ సర్కార్ ఈ నెల 12 నుంచి రుణ మాఫీ నిధులను విడతల వారీగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. 17వ తేదీ నాటికి ఖమ్మం జిల్లాలో మొత్తం 14,702 మంది ఖాతాలకు రూ.20.65 కోట్లు ప్రభుత్వం జమచేసింది.
భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 8,861 మందికి రూ.10.84 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నుంచి సమాచారం అందినట్లు జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఎం.చంద్రశేఖర్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. రూ.25 వేలకుపైగా రుణాలున్న వారికి కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి రోజూ కొందరి ఖాతాల్లో మాఫీ నగదు జమ అవుతున్నందున అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ అన్నారు.