భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ బస్ స్టేషన్ నుంచి బస్సుల పున:ప్రారంభం కావడం వల్ల ప్రయాణికులు కాస్త ఊరట చెందారు. ప్రధానంగా ఇల్లందు పరిధిలోని వందకు పైగా గ్రామాల నుంచి మహబూబాబాద్, వరంగల్, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లాక్డౌన్ నాటినుంచి ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేటు వాహనాలలో ప్రయాణం క్లిష్టంగా మారడం వల్ల బస్సుల రాకతో జిల్లాలోని వివిధ బస్టాండ్లకు తాకిడి మొదలైంది. లాక్డౌన్ నిబంధనలు ప్రకారం డిపోల్లోనే బస్సులను శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్ అందజేస్తున్నారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు. ఇతర రాష్ట్రాలకు బస్సులను నడపలేదు.