భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందులో ఉపరితల గని ప్రభావిత నిర్వాసితులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కారణంగా స్థానిక నివాసాలపై రాళ్లు, మట్టి దిబ్బలు పడటం సర్వసాధరణమై పోయింది. బ్లాస్టింగ్ చేసిన ప్రతీసారి రాళ్లు పడి జంతువులు చనిపోవడం... ప్రజలకు గాయాలవడం, ఇంటి పైకప్పులు దెబ్బతినడం పరిపాటిగా మారింది.
నిబంధనలు పట్టవా...?
నిబంధనల ప్రకారం మూడు వందల మీటర్ల పరిధి వరకు ఎటువంటి బ్లాస్టింగ్ ప్రభావం ఉండదని సింగరేణి అధికారులు చెప్పినప్పటికీ... ఉపరితల గని బ్లాస్టింగ్ తీవ్రత సమీప ప్రాంతాల నివాసాలకు అక్కడ నివసించే వారికి ప్రాణగండంగా మారింది. మంగళవారం సాయంత్రం బ్లాస్టింగ్ కారణంగా పడిన రాళ్లతో ఇంటి రేకులు పగిలి మహిళకు గాయం కావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సింగరేణి బైపాస్ రహదారిని దిగ్భంధనం చేసి.. లారీలను నిలిపివేశారు.
బ్లాస్టింగ్ చేస్తున్నప్పుడు పెద్ద శబ్ధాలు వస్తున్నాయి. అదే సమయంలో బయట పిల్లలు ఆడుకుంటున్నారు. వారిని లోపలికి తీసుకెళ్తుండగా.. ఒక రాయి వచ్చి నా కాలు మీద పడింది. పడింది చిన్నదే అయినా వేగంగా రావడంతో బలంగా తాకింది. అదే తల మీద పడి ఉంటే అక్కడే చచ్చిపోయేదానిని. రేకులు పోతే రేకులు చేయిస్తున్నారు. ప్రాణాలు పోతే ఇస్తారా? మా ప్రాణాలతో చెలగాటమాడే బదులు ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని పంపేస్తే ప్రశాంతంగా బతుకుతాం.
-స్థానికురాలు
గాలి, నీరు, ఆహారం కలుషితం
బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా రాళ్లు పడ్డ ప్రతిసారి ప్రజాప్రతినిధులు అధికారులతో రావటం.. తీవ్రత తగ్గిస్తానని చెప్పటం షరమామూలే అయిపోయిందని తెలిపారు. పేలుళ్ల తీవ్రత తగ్గించనప్పుడు తమ నివాసాలకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్ సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న బ్లాస్టింగ్ తీవ్రత కారణంగా కోడి మరణించగా నష్టపరిహారం ఇచ్చారు.. రేపు మా ప్రాణాలు పోతే నష్టపరిహారం ఇద్దామని అనుకుంటున్నారా అని నిలదీశారు. బ్లాస్టింగ్ తీవ్రత తగ్గించడం కుదరనప్పుడు మాకు ప్యాకేజీ ఇచ్చి పంపించేయండి అని స్థానికులు కోరుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారుల నుంచి స్పందన రావట్లేదంటూ వాపోతున్నారు. పేలుళ్ల వల్ల గాలి కలుషితమవుతుందని... తాగే నీరు, తినే ఆహారం దుమ్ముతో నిండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ 3 రోజులు ఆపేశారు..
చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య షూటింగ్... ఈ ఉపరితల గని ప్రాంతంలోనే జరిగిందని... అప్పుడు మూడు రోజులు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. షూటింగ్ ముగిసిన తర్వాత మళ్లీ బ్లాస్టింగ్ ప్రారంభమయ్యాయని... యధావిధిగా పేలుళ్ల తీవ్రతతో దుమ్ము, ధూళి కమ్మేసేందని వాపోయారు. అధికారులు, ప్రభుత్వం సమస్యను అర్థం చేసుకుని... ఈ కలుషితం నుంచి త్వరగా విముక్తి కలిపించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Singareni: సింగరేణి నిర్వాసిత రైతు కుటుంబం గోడు