పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెంకు చెందిన నోముల చినసత్యం, రమణమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో పెద్దవాడైన శ్రీను రామభక్తుడు. చిన్నప్పటి నుంచే స్వామి మీద భక్తి ఉన్న అతను.. పశువులను మేపుతూ జీవనం సాగించేవాడు. ఓ సారి ఆవులను మేపేందుకు వెళ్లిన శ్రీనుకు... కాలినడకన భద్రాచలం వెళ్లే కొంతమంది రామ భక్తులు కనిపించారు. వారి వెంట శ్రీను కూడా నడిచి సీతారాములను దర్శించుకున్నాడు. అనిర్వచనీయమైన అనుభూతి కలగడంతో.. ప్రతిరోజూ కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకోవాలనుకున్నాడు. ఆనాటి నుంచి ప్రతిరోజు భద్రాచలం వెళ్లడం దినచర్యగా మార్చుకున్నాడు.
ప్రతిరోజూ 30 కిలో మీటర్లు...
గోదావరి అవతల ఉండే మిట్ట గూడెం నుంచి శ్రీను ఉదయం ఏడు గంటలకే బయలుదేరుతాడు. 9 నుంచి 10 గంటల లోపు భద్రాచలం రామాలయానికి చేరుకుంటాడు. స్వామివారిని దర్శించుకొని మధ్యాహ్నం అన్నదానం సత్రంలో భోజనం చేస్తాడు. రాత్రి గుడి మూసేసే సమయానికి ఇంటికి వెళ్లిపోతాడు. ఇలా ప్రతిరోజు 30 కిలో మీటర్ల మేర చెప్పులు లేకుండా రామనామ స్మరణ చేస్తూ... కాలినడకన ప్రయాణం చేయడం విశేషం. ఆలయ అర్చకులందరూ శ్రీనుని రాముదాసు అని పిలుస్తుంటారు.
చిన్న రామదాసుగా..
ఇప్పుడు తన వయసు 36 సంవత్సరాలని... శేషజీవితం కూడా శ్రీరామ చంద్రుడి సేవకే వినియోగిస్తానని శ్రీను తెలిపాడు. ప్రతిరోజు భద్రాద్రి రాముడిని దర్శించుకుంటే అమితమైన ఆనందం కలుగుతుందని... అంతకంటే తనకు వేరే సంతోషం లేదని రామదాసు చెబుతున్నాడు.
ఇదీ చూడండి: MMTS: పట్టాలెక్కిన ఎంఎంటీఎస్ రైళ్లు