ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణి సంస్థలో కార్మికులు లక్షా 25 వేల మంది ఉంటే, ప్రస్తుతం 45వేల మంది మాత్రమే ఉన్నారని... వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ దేవి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక మండలాల్లో పర్యటించారు.
నియామకాలు ఎక్కడా...
సింగరేణిలో ఒప్పంద వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశించిన ప్రజలు పూర్తిగా మోసపోయారని ఆమె అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న రాష్ట్రంలో... నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పూర్తిగా విఫలం...
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాంతంలోని సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని... ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లాండ్ వన్డే సిరీస్