Bhadrachalam floods: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గంటగంటకూ నీటి మట్టం పెరుగుతూ.. ప్రమాదకరస్థాయికి చేరుకుంది. 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70 అడుగులు దాటింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 70.70 అడుగులకు చేరింది. 24.13 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. నీటిమట్టం పెరగడంతో కరకట్టకు ఆనుకుని గోదావరి ప్రవహిస్తోంది.
ఇదిలా ఉంటే.. భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పూజలు చేశారు. గోదారమ్మ శాంతించాలంటూ పుష్కర స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. గంగమ్మకు హారతులు ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్... ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకుల సమక్షంలో క్రతువు నిర్వహించారు.
భద్రాచలం నాలుగువైపులా వరద చుట్టుముట్టడంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. అశోక్‌నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ, అయ్యప్పకాలనీ, కొత్త కాలనీ, రామాలయం ప్రాంతం జలదిగ్బంధమయ్యాయి. సుభాష్‌నగర్ కాలనీ, రాజుపేట కాలనీలోకి భారీగా వరదనీరు చేరింది. వేలాది మంది వరద బాధితులు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. గోదావరి వంతెనపై నుంచి అధికారులు రాకపోకలు నిలిపివేయగా.. 4 రోజులుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లాలో 95 గ్రామాలు నీటమునిగాయి. ఇతర ప్రాంతాల్లోనూ ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. 77 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,155 కుటుంబాలకు చెందిన 20,922 మందిని ఈ కేంద్రాలకు తరలించారు.
మరోవైపు.. వరద ముప్పు నుంచి ఇల్లెందు సింగరేణి ప్రాంతం ఇంకా తేరుకోలేదు. వరదల కారణంగా తొమ్మిది రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో వరద చేరింది. వరద నీటిని భారీ మోటార్లతో బయటకు పంపిస్తున్నారు. నీటిని తోడేందుకు సిబ్బంది, అధికారులు 24 గంటలు శ్రమిస్తున్నారు.
9 రోజులుగా 90వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా.. సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.