భద్రాద్రి కొత్తగూడెం జిల్ల భద్రాచలం మన్యంలో ఏటా మలేరియా, డెంగీ, గన్యా కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఈసారి పక్కా ప్రణాళికతో దోమల మందును ఈ నెలాఖరు నుంచి గానీ వచ్చే నెల మొదటి వారం నుంచి గానీ మన్యంలోని 444 గ్రామాల్లో పిచికారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్ సమస్యలను అధిగమించాలని ఏర్పాట్లు చేపట్టారు.
గత ఏడాది 756 గ్రామాల్లో పిచికారీ చేయగా మారిన లెక్కలను పరిగణలోకి తీసుకుని గ్రామాల సంఖ్యను తగ్గించారు. జిల్లాలో మన్యం ప్రాంతమే ఎక్కువ ఉన్నందున తరుణ వ్యాధులపై ప్రచారం కల్పించి దోమ తెరలను పూర్తిస్థాయిలో అందించాలని చర్యలు చేపట్టారు. రెండేళ్ల కిందట 1.63 లక్షల తెరలు రాగా వాటిని పంచారు. ఇంకా 2 లక్షలు అవసరం. ఇప్పటి వరకు వచ్చినవి వియత్నాం నుంచి రాగా.. ఇప్పుడు మన దేశంలోని తమిళనాడు నుంచి వచ్చిన 58,920 ప్రత్యేక లేపనాలు పూసి తయారు చేశారు.
పదిసార్లు ఉతికినా వీటికి ఉండే శక్తి తగ్గదు. వీటిని ఎవరికి పంచాలన్నది జాబితా రూపంలో తయారు చేశారు. చెరువులు, బావులు, నీటి మడుగుల్లో గంబూషియా చేప పిల్లలను వదలడం వల్ల దోమలను నాశనం చేయొచ్ఛు ఇందుకుగాను ఐటీడీఏ ప్రాంగణంలో గంబూషియా చేప పిల్లలను పెంచుతున్నారు. వర్షాలు పడగానే అవసరమైన చోట్లకు వీటిని పంపిస్తామని మలేరియా విభాగం అధికారి మోకాళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనాపై విజయం సాధించిన మన్యం వాసులు మలేరియా, డెంగీ రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.