భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, బూర్గంపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఇల్లెందు, గుండాల , టేకులపల్లిలో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది.
పాల్వంచలో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై వరద పోటెత్తింది. పట్టణం నుంచి ఆరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కేసీఆర్ నగర్, సోనియా నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, పిచ్చయ్య బంజర, శేఖరం బంజర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాలతో జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. వాగులు వంకలు పొంగుతునందువల్ల సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ