శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధి, యాదాద్రి నారసింహుని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.
రామయ్యకు ప్రత్యేక పూజలు
శనివారం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు బంగారు తులసీదళాలతో అర్చన నిర్వహించారు. చిత్త నక్షత్రం సందర్భంగా ఆలయంలోని హోమశాలలో సుదర్శన హోమం జరిపారు. దేవస్థానంలోని బేడా మండపంలో జరిగే నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా కల్యాణం
రామయ్య కల్యాణ వేడుకలో సీతారాములకు విశ్వక్సేన ఆరాధన చేసి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం జీలకర్ర బెల్లం వేడుక, మాంగల్య ధారణ, తలంబ్రాల మహోత్సవం వైభవంగా జరిపారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
యాదాద్రిలో రద్దీ
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం తొలి శనివారం కావడంతో భక్తులు తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనం కోసం పెద్దఎత్తున బారులుతీరారు. ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు.
యాదాద్రీశుడి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం... ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.
ఇదీ చదవండి: YADADRI: దేదీప్యమానంగా యాదాద్రి పుణ్యక్షేత్రం.. సకల హంగుల సమాహారం