Godavari water level at bhadrachalam : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం నాలుగు అడుగులు ఉన్న నీటిమట్టం... సోమవారం ఉదయానికి 7.5 అడుగులకు చేరింది.
గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలంలోని చిరు వ్యాపారుల తాత్కాలిక దుకాణాలన్నీ మునిగిపోయాయి. రాత్రికి రాత్రి అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగింది. కొన్ని సామాన్లను ఒడ్డుకు చేర్చుకున్న చిరువ్యాపారులు... మరికొన్నింటిని నీటిలోనే వదిలేయాల్సి వచ్చింది. ఎగువ ప్రాంతం నుంచి ఇంకా వరద ప్రవాహం వస్తున్నందున భద్రాచలంలో నీటి మట్టం మరో మూడు అడుగుల వరకూ పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
Rain effect on Seethamma sagar : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం గ్రామం వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతోపాటు ఎగువన జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో వరద నీరు గోదావరికి పోటెత్తి... ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం నీటమునిగింది. అకస్మాత్తుగా గోదావరికి వరద నీరు పెరగడంతో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కాపర్ డ్యాం కొట్టుకుపోవడంతో పాటు... 5, 6 బ్లాకుల్లోని నిర్మాణ యంత్రాలు, జనరేటర్లు నీట మునిగాయి. అదృష్టవశాత్తు భారీ వాహనాలు నది వెలుపల ఉండటంతో ఆస్తి నష్టం తప్పింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగానే డ్రీ వాటరింగ్ చేసి... రెండు మూడు రోజుల్లో పనులు తిరిగి ప్రారంభిస్తామని సీతమ్మ సాగర్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: Crop Loss: 'దీన్ని విపత్తు అనాలా? మా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలా?'