గతేడాది కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోతట్టు మండలాలైన.. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్మగూడెం ప్రాంతాల్ని వరదలు ముంచెత్తాయి. ప్రతి ఏడాది లాగానే 50 నుంచి 55 అడుగుల మేర గోదావరి వస్తుందని ప్రజలు అంచనా వేయగా.. 2022లో ఏకంగా 70 అడుగులకుపైగా నీరు రావడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. 37 ఏళ్ల తర్వాత గోదావరి 70 అడుగులు దాటి ప్రవహించింది.
పోలవరం వల్లే.. ముంపు సమస్య ఏర్పడింది: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం వల్లే.. ముంపు సమస్య ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు గోదావరి కరకట్టను 80 అడుగుల మేర నిర్మించటం వల్లే పెను ప్రమాదం తప్పిందని.. లేకపోతే నష్టం ఇంకా భారీ స్థాయిలో ఉండేదని బాధితులు తెలిపారు. వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గోదావరి కరకట్ట ఎత్తు పెంచడానికి రూ.1000 కోట్ల నిధులు ప్రకటించారు.
6నెలలు గడుస్తున్నా.. నిధులు విడుదల కాలేదు: లోతట్టు ప్రాంత ప్రజలకు రెండు పడక గదులు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించి 6నెలలు గడుస్తున్నా.. నిధులు విడుదల కాలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు నెలల్లో మళ్లీ వర్షకాలం వస్తుందని జూన్ రాకముందే పనులు పూర్తి చేస్తే.. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటామని వారు ముఖ్యమంత్రిని కోరుతున్నారు. వరదల వల్ల గోదావరి కరకట్ట రాళ్లు లేచిపోయి మట్టి కొట్టుకుపోయింది. బలహీనంగా మారిందని ఈసారి ఆ స్థాయిలో వరదలు వస్తే కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
"వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాం. రెండు మూడు సార్లు గోదావరి వరదల వల్ల నష్టపోయాం. ఇక్కడే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం. కరకట్ట ఎత్తు పెంచితే చాలు. మాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు వద్దు.. ఏమీ వద్దు. సీఎం కేసీఆర్ గోదావరి వరద ప్రాంతాలను పరిశీలించారు. రూ.1000 కోట్లు మంజూరు చేశారు. కానీ ఇంత వరకూ పనులు ప్రారంభం కాలేదు. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి త్వరగతిన పనులు చేపట్టాలని కోరుతున్నాం." - స్థానికులు
ఇవీ చదవండి: Telangana Inflation rate 2022 : తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం రేటు
రాష్ట్రంలో మన ఊరు- మన బడి పాఠశాలలు ప్రారంభం
నిరుద్యోగులకు నిర్మల గుడ్ న్యూస్.. 38,800 టీచర్ జాబ్స్ భర్తీ