ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చివరిదైన మూడో హెచ్చరికను దాటి ప్రమాదకరంగా ప్రవహించింది. అయితే.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అంతా అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరిగింది.
పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతోపాటు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద పెరుగుతూ.. తగ్గుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల నదిలో ప్రవాహం భారీగా ఉంది. అయితే.. ఆ ప్రవాహం పెరుగుతూ.. తగ్గుతూ దోబూచులాడుతోంది.
తగ్గుతూ.. పెరుగుతూ...
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ప్రతి గంటకు నీటిమట్టం పెరుగుతూ ఉన్నప్పటికీ వేగం మందగించింది. రాత్రి 11 గంటలకు మళ్లీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. శనివారం సైతం ఇదే పునరావృతమైంది. ఆదివారం మళ్లీ రెండో ప్రమాద హెచ్చరికను దాటి నది ప్రవహించింది. అనూహ్యంగా తగ్గుముఖం పట్టింది. ఒకేసారి తొమ్మిది అడుగుల మేర ప్రవాహం తగ్గింది.
భద్రాద్రి వద్ద గోదావరి ప్రవాహం 44.6 అరుగులకు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక నడుస్తోంది. మళ్లీ ఎప్పుడు పెరుగుతుందో అర్థంకాక మన్యం వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.