Godavari flood danger levels: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి వంతెనపై సాయంత్రం 5 నుంచి రాకపోకలు బంద్ చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. వరద ముంపు దృష్ట్యా రెండ్రోజులపాటు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక: భద్రాచలం వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు గోదావరి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదిలో ప్రస్తుతం 18.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గోదావరి నది ఉద్ధృతితో భద్రాచలం పట్టణాన్ని వరదనీరు చుట్టుముడుతోంది. ఇప్పటికే భద్రాచలంలోని నాలుగు కాలనీల ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. పట్టణంలోని కొత్తకాలనీ, సుభాష్‌నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీలోకి వరద నీరు చేరింది. అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతంలోకి వరద నీరు రావడంతో ఇళ్లల్లో నుంచి బయటకు రాలేక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదిస్తున్నారు. గోదావరి ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు బయటకు రాకుండా అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 114 సెక్షన్ విధించారు.
గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాద్రి రామాలయం అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరాయి. భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీవాసులను ఇల్లు ఖాళీ చేయించి అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కల్యాణ కట్ట ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు, దిగువ ప్రాంతంలోని ముంపు మండలాలకు 3 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర -ఛతీస్‌గఢ్- ఒడిశాలకు వెళ్లే ప్రయాణికులు 3 రోజుల నుంచి భద్రాచలంలోనే నిరీక్షిస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో ముంపునకు గురైన అనేక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిన్నటి నుంచి భద్రాచలంలో వరద సమీక్షిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో వరద బాధితుల సహాయక చర్యలను మంత్రి పరిశీలించనున్నారు. అంతకంతకు వరద ఉధృతి పెరగడంతో భద్రాచలంతో పాటు ముంపు మండలాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.