భద్రాద్రి జిల్లా థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన మిగిలిన మూడు యూనిట్ల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. మణుగూరు, పినపాక మండల సరిహద్దున 1,080 మెగావాట్లతో నిర్మిస్తున్న బీటీపీఎస్ను సందర్శించారు. ఇన్టేక్ వెల్, వ్యాగన్ టిప్లేర్, క్రషర్ హౌస్, మొబైల్ కోల్ ప్లాంట్, యూనిట్ 1 ,2 3, 4, స్విచ్ యార్డ్ పనుల్ని తనిఖీ చేశారు.
రెండో యూనిట్లో సాంకేతిక సమస్య ఏర్పడడం వల్ల కొంత ఆలస్యం అయిందని, ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. కొవిడ్, వర్షాల ప్రభావంతో యూనిట్ -3కి చెందిన పనులు కొంత నెమ్మదించినా... త్వరలోనే సింక్రనైజ్ చేస్తామన్నారు. నాలుగో యూనిట్ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యేలా ప్రయత్నిస్తామన్నారు. బీటీపీఎస్ నిర్మాణానికి భూములు ఇచ్చి ఉద్యోగాలు కోరుకున్న నిర్వాసితులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. విడతల వారిగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. వచ్చే ఆరు నెలల్లో నాలుగు యూనిట్ల నిర్మాణం పూర్తి కానున్నందున ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
నిర్మాణ పనులపై అసంతృప్తి..
బీటీపీఎస్ నిర్మాణ పనులు నెమ్మదిగా జరగడంపై సీఎండీ ప్రభాకర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల పరిశీలన అనంతరం సీఎండీ జెన్కో, భేల్ అధికారులతో సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రణాళికబద్దంగా పనులు పూర్తి చేయాలని ప్రభాకర్ రావు సూచించారు.
ఇదీ చదవండి: మార్చి నాటికి మూడు కోట్ల టన్నుల ఉత్పత్తే లక్ష్యం: సీఎండీ