లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతోన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 ఆర్థిక సాయం చేస్తోంది. దీని సంకల్పం మంచిదైనా కొందరికి ఈ నగదు చేరడం లేదు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ సంఖ్యలను లింక్ చేయకపోవడం, చరవాణి సంఖ్యలను ఖాతాదారులు ఇవ్వకపోవడం, ఇచ్చినా పలువురు మార్చడం, ఏ బ్యాంకుల్లోనైనా ఎన్నైనా ఖాతాలు తెరుచుకొనే వెసులుబాటు ఉండటం వంటివి సమస్యకు కారణం అవుతున్నాయి.
ఏదైనా ఒక ఖాతా మనుగడ లేకుంటే వారి ఖాతాలను నిలిపి(క్లోజ్)వేసేలా బ్యాంకులు చర్యలు తీసుకోకపోవడం కూడా కొందరు ఖాతాదారులకు శాపంగా మారింది. ప్రతినెల పౌరసరఫరాలశాఖ నుంచి వచ్చే బియ్యం వరుసగా గత మూడు నెలలుగా తీసుకోకుంటే వారికి నగదు ఇవ్వకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది.
ఉభయ జిల్లాల్లో...
- భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు రూ.74.96 కోట్లు జమ అయ్యాయి. ఏప్రిల్‌కి రూ.37.50 కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి. మే 7 వరకు రూ.37.46 కోట్లు తెల్ల రేషన్‌కార్డుదారులకు ఉన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
- డార్మెంట్ రేషన్‌కార్డులు మినహా మిగతా ఖాతాలన్నింటికీ మే నగదు మిగిలిన ఖాతాల్లోనూ ఒకటి, రెండు రోజుల్లో పడనుంది.
- ఖమ్మం జిల్లాలో ఏప్రిల్‌లో రూ.53 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. మే నెలకి సంబంధించి చెల్లింపులు కొనసాగుతున్నాయి. వాటి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.
వీటి సంగతేమిటి?
గత మూడు నెలలుగా రేషన్(బియ్యం) తీసుకోని వారికి రూ.1,500 నగదు వేయడం లేదు. తెల్లరేషన్‌కార్డుదారులు బియ్యం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అలాంటి బియ్యం గత మూడు నెలలుగా తీసుకోవడం లేదంటే అతనికి ప్రభుత్వం సాయం అవసరం లేదని అనుకోవడమే. అయితే వలస వెళ్లిన వారు, ఉపాధి నిమిత్తం ఇతర జిల్లాల్లో ఉంటున్న వారికి స్థానిక రేషన్ దుకాణంలో సరకులు తీసుకొనే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. అయినా తెల్లరేషన్‌కార్డుదారులు బియ్యం తీసుకోకపోతే వారిని డార్మెంట్ జాబితాలో చేర్చారు.
తిరస్కరణకు ప్రధాన కారణాలివీ..
- తెల్లరేషన్‌కార్డుదారులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోవడం
- ఖాతాదారులను సంప్రదించాలంటే కనీసంగా చరవాణి(ఫోన్) సంఖ్య లేకపోవడం
- ఖాతా తెరిచిన సమయంలో ఇచ్చిన నంబర్లు ఖాతాదారులు ప్రస్తుతం మార్చేయడం
- రెండు, అంత కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉండటం
చెల్లింపులు జరుగుతున్నాయి
తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ.1,500 చెల్లింపులు కొనసాగుతున్నాయి. ఖాతాలు క్లియర్‌గా ఉన్న వారికి మే నెల మొత్తం కూడా పడుతోంది. కొందరికి తపాలా శాఖ ద్వారా కూడా చెల్లింపులు చేస్తున్నాం.
- మధుసూదన్, అదనపు కలెక్టర్ ఖమ్మం
టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..
సమస్యలు, అనుమానాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్లు కేటాయించారు.
1967, 180042500333