కేంద్ర వ్యవసాయ చట్టాలు పెట్టుబడి దారులకు ఉపయోగపడేలా ఉన్నాయని సీపీఐఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత సాధినేని వెంకటేశ్వర్లు ఆరోపించారు. అన్నదాతలకు ఏ మాత్రం ఉపయోగపడవని మండిపడ్డారు. ఏటా 14వేల మంది రైతులు చనిపోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అన్నారు.
ప్రధాని చెప్పాలి..
కేంద్రం తీరుతో రైతు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోపించారు. చిన్న మార్కెట్లలో మోసాలు జరుగుతున్నాయని చెబుతున్నా.. ఇటువంటి చట్టాలతో వాటిని ప్రభుత్వం ఎలా అడ్డుకోగలదని ప్రశ్నించారు. ఇందులో కనీస మద్ధతు ధర లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పలు సమావేశాల్లో అన్నదాత గురించి మాట్లాడే ప్రధాని దీనిపై ఎందుకు చేర్చించలేదో చెప్పాలని పేర్కొన్నారు.
ఎందుకు జరిపారు..
పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి కనీస ధర, చట్టాల గురించి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. రైతు నిరసనల వెనక విచ్చిన్న శక్తులున్నాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం.. అనుమానాలున్నప్పుడు వారితో చర్చలు ఎందుకు జరిపారని విమర్శిచారు.
దేశానికి అన్నం పెట్టే రైతు ఆందోళనలో.. ఆ అన్నం తినే ప్రజలంతా భాగస్వాములే. ప్రధానిని కలిసిన తర్వాత అన్నదాతల నిరసనల పట్ల సీఎం కేసీఆర్ సైతం మౌనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భాగస్వామ్యం కావాలి. వీటిపై ఆయన వైఖరేంటో స్పష్టం చేయాలి.
-సాధినేని వెంకటేశ్వర్లు, సీపీఐఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నేత
ఇదీ చూడండి: 'వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు, నియంత్రిత సాగు ఉండదు'