భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పాత డిజైన్లోనే కట్టి ఆదివాసీలకు నష్టం జరగకుండా కాపాడాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత ఆవునూరి మధు డిమాండ్ చేశారు. పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మిస్తే.. ఇల్లందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం, గుండాల, ఆళ్ళపల్లి తదితర మండలాలకు సాగునీరు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన, ఉద్యమాల పట్ల తెరాస నాయకులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లందు నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేశారు.
పాత డిజైన్‌తోనే నియోజకవర్గానికి తాగునీరు అందేలా ఉన్నప్పుటు కొత్తగా డిజైన్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బాధ్యత గల ఎమ్మెల్యే, మంత్రి, సంబంధిత అధికార యంత్రాంగం రోళ్లపాడు రిజర్వాయర్ ద్వారా ఇల్లందు నియోజక వర్గానికి నీళ్లు అందిస్తామని ప్రకటించాలని కోరారు. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరుకు వెళ్ళే పనులు వేగంగా జరుగుతున్నాయని.. శంకుస్థాపన చేసి.. నాలుగేండ్లు దాటుతున్నా.. రోళ్ళపాడు నుండి టేకులపల్లి, ఇల్లందు, బయ్యారం, గార్ల ప్రాంతాలకు నీళ్ళందించే పనులు ఎందుకు చేపట్ట లేదని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు నీళ్ళను ఇల్లందు నియోజకవర్గంతో పాటు ఏజెన్సీ మండలాలకు అందించాలని రోళ్ళపాడు రిజర్వాయర్ ఏర్పాటుకై, పనులు ప్రారంభించే వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం