సాయం చేయాలనే ఆలోచన ఉంటేనే సరిపోదు.. దానికి మరో నాలుగు చేతులు తోడవుతేనే ఆ లక్ష్యం నెరవేరుతోంది. సొంతలాభం కొంత మానుకుని పొరుగువానికి సాయపడవోయ్ అన్న గురజాడ మాటలను అక్షరాలా పాటిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన కొందరు. పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు కలిసి చేయూత పేరుతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయం చేస్తున్నారు. నెలా నెలా గ్రూపు సభ్యులంతా కొంత మొత్తం సమకూర్చుకుని నెలకో సేవా కార్యక్రమం చేపడుతున్నారు.
అక్టోబరులో ఖమ్మం జిల్లా బోనకల్లు శాంతి నిలయంలో తల్లిదండ్రులు వదిలేసిన మానసిక వికలాంగులకు సాయం అందించారు. నవంబరులో మంచిర్యాల జిల్లా చందరంలో అనాథలైన ఇద్దరు అమ్మాయిలకు ఆర్థిక తోడ్పాటునిచ్చారు. డిసెంబరులో భద్రాచలంలోని సరోజిని అనాథ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరకులు అందించారు. గ్రూపులో సుమారు 80 మంది ఉన్నారు. వారంతా నెల నెలా రూ.100 నుంచి 200 వేసుకుని ఆ మొత్తాన్ని పలు సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఒక్కరిలో మొదలైన ఆలోచన.. కొందరిలో కదలిక తెచ్చి అందరినీ ఏకం చేసి... అభాగ్యులకు అండగా నిలుస్తోంది. ఇతరులకు ఆదర్శమవుతోంది.
ఇదీ చూడండి: అభిమాని ఫాస్ట్ఫుడ్ సెంటర్లో సోనూసూద్ సందడి