ప్రతీ ఏటా జరిగే శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో రేపటి నుంచి ఏప్రిల్ 20 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. తెలుగు సంవత్సరాది రోజున పంచాంగ శ్రవణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఈ నెల 10న ఉత్సవ అంకురార్పణ నిర్వహిస్తారు. 11న గరుడా దివాసము తిరువీధి సేవ చేస్తారు. 12న అగ్ని ప్రతిష్ఠ ద్వజారోహణము ఉంటుంది. 13న మిధిలా మండపం ఎదురుగా సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.
14న శ్రీరాముడు పుట్టిన రోజు దేశం మొత్తం శ్రీరామనవమిని నిర్వహిస్తారు. అదే రోజు భద్రాచలంలో సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. లోక కల్యాణం తిలకించడం వల్ల భక్తులంతా పాపాలు పోయి సకల పుణ్యం కలుగుతుందని నమ్ముతారు. అందుకే కల్యాణం చూసేందుకు వేలాదిగా భద్రాచలం తరలివస్తారు.
15న రామయ్య పట్టాభిశక్తుడవుతాడు. రాజ కిరీటం, రాజ దండం ధరింపచేసి సకల రాజలాంఛన సేవలు చేస్తారు. 16న వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వేద పండితులు స్వామి వారిని వివిధ వేదాలతో మహదాశీర్వచనం అందిస్తారు. 17న సీతారాములకు తెప్పోత్సవం దొంగల దోపోత్సవం ఆనందకరంగా జరుపుతారు. 18న సింహ వాహనమున వేంచేపింప చేసి ఊంజల్ సేవ చేస్తారు. 19న వసంతోత్సవం చేస్తారు. 20న శ్రీ చక్రమునకు నదీ స్నానం చేయించి ఉత్సవాలను సమాప్తి చేస్తారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు బ్రహ్మోత్సవాలను చూసి తరించండి... శ్రీరాముని ఆశీస్సులు పొందండి.
ఇవీ చూడండి: అకాల వర్షంతో అన్నదాతకు కన్నీరు