Bhadrachalam Sitaramula Edurukolu Utsavam: శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం ఈరోజు కన్నుల పండువగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కల్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది.
ఇవాళ వేద మంత్రోచ్ఛారణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీనుల విందుగా ఈ పండువ సాగింది. ఆలయ పరిసరాల్లో భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణలతో ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. బేడా మండపంలో ఎదురెదురుగా శ్రీ రాములవారు, సీతమ్మ తల్లి ఆశీనులు కాగా వేదపండితులు, అర్చకులు పోటాపోటీగా వారిని కీర్తించారు.
వధూవరుల వంశ కీర్తి ప్రతిష్ఠల్ని వేదపండితులు వివరించారు. చూడచక్కని వాడు ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరఫు పురోహితులు కీర్తించగా సుగుణాల రాశి, అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్ఠలంటూ సీతమ్మ తల్లి తరఫు అర్చకులు వారిని కీర్తించారు. వేద మంత్రోచ్ఛారణలు, వేద పండితుల సంభాషణల మధ్య ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని గణంగా నిర్వహించారు.
వధూ వరుల వంశాల విశిష్ఠతను వివరిస్తూ సీతారాముల ఔన్నత్యాన్ని అందరికీ చాటి చెప్పారు. ఈ మేరకు వారు సీతారాముల గుణగణాలను కొనియాడారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్య చక్కని జోడి అని వేద పండితులు సంభాషించారు. వారి జంట కనుల పంట అని సీతారాముల వారిని కొనియాడారు. ఆలయానికి లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం అధికారులు రూ.2 కోట్ల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి నలుమూలల స్వాగత ద్వారాలు.. కల్యాణం జరిగే మిథిలా మైదానంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు కూడా సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు తలేత్తకుండా సెక్టార్ల వారీగా విభజించారు. ఆలయానికి అందమైన రంగులద్ది, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను కూడా సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా గురువారం ప్రధాన ఆలయంలో కల్యాణ క్రతువు నిర్వహించినున్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు కల్యాణ మండపంలో మహోత్సవాన్ని జరిపించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. శుక్రవారం జగదబి రాముని పట్టాభిషేకాన్ని వేడుకగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి: