జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 8540మంది హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కేటాయించిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వాక్సిన్ ఇవ్వాలని ఆస్పత్రి సూపరిండెంట్‌ను ఆదేశించారు.
జిల్లాలో ఈనెల 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ పంపిణీలో.. మొదటిరోజు 120, రెండో రోజు (18వ తేది) 700మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నేడు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో(44).. ఒక్కొక్క కేంద్రానికి 100చొప్పున మొత్తం 4400మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని.. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నుంచి మినహాయించినట్లు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఎదైనా ఇబ్బంది ఎదురైతే.. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలనుసారం.. తదుపరి పంచాయతీ వర్కర్స్కు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేపడతామని వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు వాక్సిన్‌పై ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా టీకాపై మీ డౌట్స్ ఇవేనా?