ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ వసతులతో కూడిన పాఠశాల అడ్మిషన్లు పొందే పరిస్థితుల్లో ఒక్క ఫొటోతో తన జీవితాన్ని మార్చుకో గలిగింది చిన్నారి వైశాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధిలోని సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో తనను ఆసక్తిగా ఫొటో తీస్తున్న బాలికను ఆయన గమనించారు. చిన్నారి ఫొటో తీసేందుకు సహకరించి.. తరువాత ఫొటో చూపించమని కోరారు.
కలెక్టర్ అభినందనలు
అనంతరం ఆ పాప.. కోతులు పట్టేందుకు తిరుపతి నుంచి వచ్చిన గణపతి అనే వ్యక్తి మనవరాలు అని కలెక్టర్ తెలుసుకున్నారు. చురుకుదనం గల వైశాలికి ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచి మంచి విద్యాభ్యాసానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోతులను పట్టి అడవుల్లో వదులుతున్న గణపతిని సైతం కలెక్టర్ అభినందించారు. తమకు కొంత బకాయి రావలసి ఉందని గణపతి చెప్పగా.. సంబంధిత బిల్లులు తక్షణమే చెల్లించాలని అధికారులకు సూచించారు. మరోవైపు పట్టణంలో పర్యటిస్తున్న కలెక్టర్.. చేపలు విక్రయిస్తున్న యువకుడి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. మైనింగ్ విద్య చదువుతూ చేపలు విక్రయిస్తున్న అతడిని అభినందించి కరచాలనం చేశారు.
ఇదీ చదవండి: విద్యుత్తు బకాయిదారులు భారీగా పెరిగారు..!