విద్యాబుద్ధులు నేర్చుకుందామని వచ్చిన ఆ పిల్లలు అష్టకష్టాలు పడుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాల్లో పడరాని పాట్లు పడుతున్నారు. ఇరుకు గదుల్లో.. అరకొర వసతుల నడుమ...అపరిశుభ్ర పరిసరాల సాక్షిగా చదువును సాగిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు. పాఠశాల ప్రాంగణం పందులకు అడ్డాగా.. అపరిశుభ్రానికి నిలయంగా మారింది.
పిల్లల సంఖ్య పెరిగింది... తరగతి గదులు పెరగలేదు
ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో గతేడాది 100 మంది బాలికలు ఉండేవారు. ఈ ఏడాది 180 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండకాస్తున్నప్పుడు ఎలాగోలా నెట్టుకొస్తున్నా వర్షం కురిస్తే వీరి కష్టాలు వర్ణాణాతీతం. పాఠశాల ప్రాంగణం మొత్తం మురుగు నీరు ముంచేస్తోంది. ఉన్న గదులనే వంట గదిగా.. తరగతి గదిగా... రాత్రి సమయంలో పడుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు.
భరించలేకపోతున్నాం...
అపరిశుభ్రత వల్ల ఇప్పటికే కొందరు జబ్బుపడ్డారు. భరించలేని దుర్వాసన వస్తున్నా అక్కడే తిని.. అక్కడే పడుకుంటున్నామని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా నిర్మిస్తోన్న భవనం అందుబాటులోకి వచ్చేలోగా తమకు ఎక్కడైనా వసతి కల్పించాలని... లేకపోతే సెలవులైనా ఇప్పించాలని విద్యార్థినిలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమగోడును పట్టించుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: కాళేశ్వరం ఆనకట్టలు, పంపుహౌస్లకు దేవతల పేర్లు