మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో(Gadchiroli Encounter) ఒక్కసారిగా రెడ్ కారిడార్ ఉలికిపాటుకు గురైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు ఆనుకొని ఉన్న గడ్చిరోలి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది చనిపోవడంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర చరిత్రలోనే ఈ ఆపరేషన్ అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఏడాది మేలో సి-60 పోలీసు బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇదే జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. రెడ్‌కారిడార్లో ఇలా వరుస ఘటనలతో మావోలకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల మధ్య జరిగిన ఈ అలజడితో భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు(police high alert) అప్రమత్తమయ్యారు.
నిర్బంధాలతో... దండకారణ్యానికి అనుబంధంగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులకు గతేడాది నుంచి తీవ్ర నిర్భంధాలు ఆరంభమయ్యాయి. అక్టోబరు 25న ములుగు జిల్లాలోని వాజేడు సరిహద్దు బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన విషయం విధితమే. మావోయిస్టులకు అత్యంత సేఫ్‌జోన్‌గా మారిన దండకారణ్యంలో భద్రతాబలగాలు(police high alert) ముప్పేట దాడికి దిగినట్లుగా ఈ భారీ ఎన్‌కౌంటర్ ద్వారా తేటతెల్లమవుతోంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో సంయుక్త ఆపరేషన్లకు శ్రీకారం చుట్టిన పోలీసులు దండకారణ్యంలో పద్మవ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కొంతకాలంగా కీకారణ్యాలలో పోలీసులు పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ బేస్‌క్యాంపుల ఏర్పాటు ద్వారా మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్న భద్రతా బలగాలు వ్యూహాత్మక ఆపరేషన్లతో మావోయిస్టులను కట్టడి చేస్తున్నాయి.
మారిన వ్యూహం..
బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దు తర్రెం పోలీసుస్టేషన్ పరిధిలోని జీరగూడా అటవీప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో మావోయిస్టులు చేసిన మెరుపుదాడిలో 22 మందికి పైగా పోలీసులు మరణించిన ఘటన భద్రతాబలగాలను అంతర్మథనంలో పడేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగినట్లుగా చెబుతున్న ఈ భీకరదాడి అనంతరం అటు ఛత్తీస్‌గఢ్.. ఇటు తెలంగాణతోపాటు(police high alert) ఒడిశా, మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టులపై పదునైన వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. మెరుపుదాడిని సవాల్‌గా తీసుకున్న భద్రతా బలగాలు రెడ్‌కారిడార్‌ను లక్ష్యంగా చేసుకొని యుద్ధం కొనసాగిస్తున్నాయి.
మావోయిస్టుల చెర నుంచి ఒకరి విడుదల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అపహరించిన అటెండర్ లక్ష్మణ్‌ను శుక్రవారం రాత్రి విడిచిపెట్టారు. బీజాపూర్ జిల్లాలో పీఎం గ్రామీణ సడక్ యోజన పథకం కింద మాన్‌కేళీ-ఘట్‌గోర్ణ రహదారి నిర్మాణం పనులను చేపట్టారు. ఈ పనులకు ఆగ్రహించిన మావోయిస్టులు సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్, అటెండర్ లక్ష్మణ్‌ను గురువారం సాయంత్రం అపహరించి తీసుకెళ్లారు. ఇదిలాఉండగా అటెండర్‌ను శుక్రవారం రాత్రి మావోయిస్టులు విడిచి పెట్టడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. సబ్ ఇంజినీర్‌ను మాత్రం మావోయిస్టులు విడిచిపెట్టలేదు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులతోపాటు స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధిత సబ్‌ఇంజినీర్ భార్య అర్పిత కన్నీరు మున్నీరులా విలపిస్తూ తన భర్తకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని, మానవతా దృక్పథంతో విడిచిపెట్టాలని తన మూడేళ్ల కుమారుడితో కలిసి మావోయిస్టులను వేడుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో శనివారం విడుదలైంది. తన భర్తను ప్రాణాలతో విడిపించుకోవడానికి ఆమె తన కుమారునితో అడవి బాట పట్టడానికి సిద్ధమైంది. ఈ ఘటనపై బీజాపూర్ జిల్లా ఎస్పీ కమలోచన్ కశ్యప్ దర్యాప్తు చేస్తున్నారు.
‘సమాధాన్- ప్రహార్ దాడుల్లో భాగంగానే క్యాంపులు’
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాధాన్- ప్రహార్ దాడుల్లో భాగంగానే సరిహద్దులో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని మావోయిస్టు బీకేటీజీ డివిజన్ కార్యదర్శి ఆజాద్ శనివారం విడుదల చేసిన లేఖలో(moist letter) పేర్కొన్నారు. పాలక ప్రభుత్వాలు కుమ్మక్కై పథకం ప్రకారం ఆంధ్ర, తెలంగాణ, దండకారణ్య సరిహద్దుల్లో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఆదివాసీల హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి నిర్భంధాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమకు అవసరమైన పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలు.. వంటి కనీస సౌకర్యాల కోసం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా రోడ్లు, క్యాంపుల ఏర్పాటు ద్వారా అభివృద్ధిని చూపడం సిగ్గుచేటన్నారు. అడవుల్లో ఖనిజ సంపద, వనరులను సామ్రాజ్యవాదులకు దోచిపెట్టేందుకు విప్లవోద్యమాన్ని, గిరిజనుల అడ్డు తొలగించడం కోసమే అప్రకటిత యుద్ధానికి దిగారని పేర్కొన్నారు. కూంబింగ్ పేరుతో పోలీసు బలగాలు ఆదివాసీలపై విచక్షణారహితంగా వ్యవహరిస్తూ వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నాయని లేఖలో ఆరోపించారు. పోలీసు(police high alert) క్యాంపులతో సాగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రతిపక్ష పార్టీలు పోరాడాలని లేఖలో ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: Gadchiroli Encounter news : గడ్చిరోలి ఎన్‌కౌంటర్ మృతుల్లో తెలంగాణ వారున్నారా?