భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలకు తెరపడింది. భక్కులు లేకుండానే అత్యంత నిరాడంబరంగా.. ఎదుర్కోలు, కల్యాణ మహోత్సవం, పట్టాభిషేక ఘట్టాలు ముగిశాయి. ప్రధాన ఆలయంలోని బేడా మండపంలో సీతాసమేతంగా రాజాధిరాజుగా సాక్షాత్కరించిన జగదభిరాముడు.. భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. కేవలం వైదిక పెద్దలు, కొంతమంది ప్రముఖుల సమక్షంలోనే జగాలను ఏలిన భద్రాద్రి రాముడిని రాజాధిరాజుగా ప్రకటించారు.
రాజ్యాధినేతగా రామచంద్రుడు..
మహాపట్టాభిషేక మహోత్సవ క్రతువు శాస్త్రోత్తంగా, సంప్రదాయబద్దంగా, వైభవంగా సాగింది. తొలుత స్వామి వారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వైదిక పెద్దలు పట్టాభిషేక క్రతువు విశిష్టతను వివరించారు. విష్వక్సేన పూజ, పుణ్యహ వచనం నిర్వహించి ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. స్వామివారికి అలంకరించారు. కలశాలతో హనుమంతుడికి అభిషేకం నిర్వహించారు. సీతారాముల వారికి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. తర్వాత వేదపండితులు.. శ్రీరామచంద్రుడిని పట్టాభిషిక్తుడిని చేశారు. రాజ్యాధినేతగా సీతారామచంద్రస్వామి వారు నేనున్నానంటూ ప్రజలకు అభయమిచ్చారు.
వరుసగా రెండోసారి భక్తకోటికి నిరాశే..
మహాపట్టాభిషేక మహోత్సవం తర్వాత ఆనవాయితీగా సాయంత్రం నిర్వహించే తిరువీధి సేవనూ ఆలయం లోపలే నిర్వహించారు. మొత్తంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైభవంగా సాగిన బ్రహ్మోత్సవాలు కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండో ఏటా భక్తకోటికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
ఇదీ చదవండి: ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి