భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో మహిళలపై కొంతమంది వ్యక్తులు అమానుషంగా దాడి చేశారు. పట్టణంలోని వెంకటదుర్గా థియేటర్ సమీపంలో నివాసముంటున్న మేడవరపు హరినాథరావుకు చెందిన ఇంటి స్థలం విషయంలో కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలం కంచర్ల భాస్కరరావు అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లుగా ధ్రువపత్రాల్లో ఉండటమే వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం భాస్కరరావు పోలీసుల సమక్షంలో కొబ్బరి చెట్లు నరికించి, జేసీబీతో స్థలాన్ని చదును చేయించాడు. అడ్డుకున్న హరినాథరావు కుటుంబసభ్యులను పోలీసులు వీడియో తీసి కేసు నమోదు చేస్తామని బెదిరించారు. మళ్లీ ఇవాళ ఆ స్థలంలో పనులు చేయిస్తుండగా... బాధితులు అడ్డుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా... తన వెంట తెచ్చుకున్న కిరాయి వ్యక్తులతో విచక్షణా రహితంగా దాడి చేయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
హరినాథరావు భార్య రమాదేవి, కోడలు పార్వతిపై దాడి చేస్తుండగా... చరవాణీలో చిత్రీకరిస్తున్న వ్యక్తిపై కూడా విరుచుకుపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, కబ్జాదారులకే అనుకూలంగా వ్యవహరిస్తూ తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, పాల్వంచ డీఎస్పీ జోక్యం చేసుకొని న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రోధించారు.
ఇవీ చూడండి: భార్యతో గొడవపడ్డాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు