ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తొలి అజెండా విద్యాశాఖ అంశంపై రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి, తలమడుగు మండల జడ్పీటీసీ సభ్యుడు గోక గణేష్ రెడ్డి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే విద్యాశాఖ అంశం చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా... ఎన్నో సమస్యలున్నాయని తలమడుగు మండల జడ్పీటీసీ సభ్యుడు గణేష్‌రెడ్డి గుర్తు చేశారు.
మంత్రి గారు..మీరు వినాల్సిందే !!!
ఒక్కోటి వివరించే ప్రయత్నం చేయగా సమయం తక్కువగా ఉన్నందున ప్రసంగం ముగించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సహా ఛైర్మన్ జనార్దన్ వారించే ప్రయత్నం చేశారు. దీనికి ప్రతిగా సదరు సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రిగా మీరు వినాల్సిందేనని..మీలాగే మేము ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యలమేనంటూ సూటిగా తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉత్కంఠకు తెరలేచింది. సమయం సరిపోకపోతే రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగించాలని అసెంబ్లీ, పార్లమెంటు చట్టసభలకు లేని సమయభావం స్థానిక సంస్థలకే ఉంటుందా..? అని ఘాటుగా విమర్శించారు.
తీవ్ర ఉత్కంఠత అనంతరం సద్దుమణిగిన వివాదం
అనంతరం మంత్రిని, జడ్పీటీసీ సభ్యుడు నిలదీయడం వల్ల తెరాస జడ్పీటీసీ సభ్యులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జవాబు ఇవ్వాల్సిందేనని జడ్పీటీసీ సభ్యుడు పట్టుబట్టారు. చివరికి సంబంధిత అధికారులను పిలిపించిన పాలక పక్షం..సభ్యుడు అడిగిన వివరాలు అందజేయడంతో వివాదం ముగిసింది.