ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామ శివారు పెన్‌గంగ పరిసరాల్లో రహదారిపై పులి అడుగులు గ్రామస్థుల కంట పడడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. వారం కిందట గొల్లఘాట్, తాంసీ శివారులో పులి దాడుల్లో రెండు పశువులు హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పులి కదలికలు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మళ్లీ గ్రామ శివారులో పులి అడుగులు కనిపించడంతో పంట చేలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. అటవీశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుని పులి జనసంచారం వైపు రాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
*ఇద్దరు మృతి:
పెంచికల్ పేట మండలం కొండపల్లిలో పత్తి కూలికి వెళ్లిన పసుల నిర్మల అనే బాలికను పెద్దపులి హత మార్చింది. తోటివారు అప్రమత్తం అయ్యేలోపే నిర్మల మృతి చెందింది. కళ్ల ముందే కన్నబిడ్డను పోగొట్టుకుని ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లిన విఘ్నేష్ అనే యువకున్ని పులి పొట్టనబెట్టుకుంది.
*అధికారులు ఏం చేస్తున్నారు:
అటవీ ప్రాంతాల్లో పులిబోన్లను ఏర్పాటు చేశారు. దహేగాం, బెజ్జూరు మండలాల పరిధిలోని దిగడా, టేపర్‌గాం, రాంపూర్, శంకరాపురం, రావులపల్లి, మొట్లగూడ పరిసరాల్లో పులి కదలికలను పరిశీలిస్తున్నారు. పులి కదలికలను పసిగట్టటానికి అక్కడక్కడా సీసీ కెమెరాలను అమర్చారు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పులి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
*పులి ఎదురైతే ..
ఉదయం, సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతం వైపు, పంటచేల వైపు వెళ్లొద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ పులి ఎదురైనా పరిగెత్తకుండా నిటారుగా నిలుచుంటే దానంతట అదే వెనుదిరుగుతుందని చెబుతున్నారు.
*పరిహారం కంటే ప్రాణం ముఖ్యం:
పెద్దపులి దాడిలో చనిపోతే ప్రస్తుతం రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నారు. పరిహారాన్ని పెంచాలని అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మహారాష్ట్ర తరహాలో ఇక్కడా రూ.15 లక్షలు ఇవ్వాలని అటవీ శాఖ కోరుతోంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాటెలా ఉన్న కనీసం ప్రాణాలకైనా రక్షణ కల్పించాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు.
*ప్రజలు ఏం అంటున్నారు..
పంట పొలాలకు వెళ్లలేక.. కూలీలు రాక.. పంటను ఇంటికి చేర్చలేక నానా అవస్థలు పడుతున్నామని పలువురు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఉద్యోగం చేసుకునేవారు, పనులు చేసుకునేవారు బయటికి అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. పులికి ఆహారం అవడంకంటే ఇంటి పట్టునే ఉండడం మంచిదని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులుల జాడ కనుక్కోవడంలో అటవీశాఖ ప్రయత్నాలు తరచూ విఫలమవుతున్నాయని వాపోతున్నారు.
ఇదీ చూడండి: పూజ కోసం... రంగురంగుల వెండిపూలు!