ఆదిలాబాద్ జిల్లాలో పొరుగుసేవల ఎంపిక నిర్వహణలో అధికారయంత్రాంగం ఆదినుంచి పక్షపాత ధోరణినే అవలంబిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగాల నిర్వహణ కోసం పొరుగుసేవల ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు కమిటీ ఉంటుంది. ఇందులో జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా, ఉపాధికల్పనాధికారి మెంబర్ కన్వీనర్‌గా, కార్మికశాఖ అసిస్టెంట్ కమిష్‌నగర్, ఖజానాశాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ పొరుగుసేవల సంస్థల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీలను ఎంపిక చేయాలి.
ఈ ఏడాది జూన్ 13న అధికారయంత్రాంగం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. అంతకుముందు ఉద్యోగాల నిర్వహణలో అనుభవం, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌తోపాటు ఇన్‌కం టాక్స్ పత్రాలను పొందుపర్చాలని అందులో సూచించింది. టెండర్‌లో పాల్గొనే ఏజెన్సీలు 2017, 2018, 2019 సంవత్సరాల ప్రవర్తన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది. జూన్ నెల 22వరకు షెడ్యూల్స్ స్వీకరించింది. మొత్తం 36 షెడ్యూల్స్ దాఖలయ్యాయి.
ఈ టెండర్ ప్రక్రియను అదేరోజు అదనపు పాలనాధికారి నేతృత్వంలో షెడ్యూల్స్ దాఖలు చేసిన ఏజెన్సీల నిర్వహకులు సమక్షంలోనే తెరిచి, అర్హత సాధించిన పొరుగుసేవల ఏజెన్సీల పేర్లు వెల్లడించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. సరైన పత్రాలు సమర్పించ లేదనే కారణంతో ఆరోజు రెండు షెడ్యూల్స్‌ను తిరస్కరించడంతో టెండర్ ప్రక్రియ ముగించారు. మిగిలిన 34 ఏజెన్సీలు అర్హత సాధించినట్లుగా పొరుగు సేవల నిర్వహకులు భావించారు. కానీ అధికారులు ఆ పేర్లు వెల్లడించలేదు. తరువాత జులై 27న కేవలం 17 పొరుగుసేవల ఏజెన్సీలే అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 22న వెల్లడించకుండా దాదాపుగా 25రోజుల అనంతరం జాబితా ప్రకటించడంలో అధికారులకు కలిసివచ్చిన అంశం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
తప్పు చేస్తే చర్యలు తప్పవు: అదనపు పాలనాధికారి సంధ్యారాణి
జిల్లాలో పొరుగుసేవల ఏజెన్సీల ఎంపికలో పూర్తిగా పారదర్శకత పాటించాలని ముందుగానే ఆదేశించాం. ఎక్కడా పక్షపాతం చూపించడానికి వీల్లేదు. ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సిందే. పైగా గుత్తేదారులకు వెంటనే ఆర్థిక సంబంధమైన లబ్ధి చేకూరే అవకాశం కూడా లేదు. ఉపాధికల్పశాఖ, కార్మికశాఖ, ఖజానాశాఖల అధికారుల సమక్షంలో టెండర్ ప్రక్రియ జరిగింది. టెండర్‌లో అవకాశం దక్కనివారి షెడ్యూల్స్ ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో కూడా తెలియచేయాల్సి బాధ్యత అధికారులపై ఉంది. ఇందులో నిబంధనలకు విరద్ధంగా తప్పచేసినట్లు తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
కారణమేంటి
సహజంగా టెండర్ షెడ్యూల్స్‌ను స్వీకరణ చివరిరోజున వాటిని తెరవాలి. దీనికి భిన్నంగా ఏకంగా 25రోజుల తరువాత ఏకపక్షంగా వెల్లడించడం అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఒకరిద్దరు గుత్తేదార్లతోపాటు మరికొంతమంది స్థానిక గుత్తేదారుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఉద్దేశపూర్వకంగానే 17 మంది షెడ్యూల్స్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం టెండర్ తెరిచేరోజు మిగతావి తిరస్కరించి ఉంటే ఏ ఇబ్బందీ తలెత్తేది కాదు. కానీ అలా జరగలేదు. తమకు అనుకూలమైన కొంతమంది గుత్తేదార్లకు రహస్యంగా అన్ని అవకాశాలు కల్పించడమే కాకుండా వారి పత్రాలు సరిచేయడంతోపాటు మిగిలినవారిని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టడం వెనక భారీగా డబ్బుల తతంగం నడిచిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మూడు సంవత్సరాల అనుభవాన్ని, ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ నిబంధనలను చూపించి కొత్త గుత్తేదార్లు టెండర్‌లో పాల్గొనకుండా ఓ అధికారి వ్యూహాత్మకంగా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'