ఓ వైపు కరోనా కష్టం... లాక్డౌన్ వల్ల పనులు లేవు.. ఉపాధి కోసం ఉన్న ఊరుని వదిలిన ఆ జంట పట్టణానికి వెళ్లారు. కూలీనాలీ చేసుకుని పొట్టపోషించుకున్నారు. గర్భవతి అయిన ఆమె లాక్డౌన్ కష్టకాలంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఉపాధిలేక పట్టణంలో ఉండలేక సొంతూరు ఆశ్రయం ఇవ్వకపోతుందా అనే కొండంత ఆశతో పండంటి బిడ్డను ఎత్తుకుని ఊరుకొస్తే... కరోనా భయంతో గ్రామస్థులు వారిని ఊళ్లోకి అనుమతించలేదు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం రాజుల మడుగుకి చెందిన జైతు అనసూయ బతుకుదెరువు కోసం కరీంనగర్ వెళ్లారు. ఈ నెల 14న కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నగరంలో ఉపాధి లేకపోవడం వల్ల బిడ్డను ఎత్తుకుని సొంతూరు కొచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని ఊళ్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎటువెళ్లాలో తెలియని పరిస్థితిలో ఊరి చివర గుడారం వేసుకుని ఉన్నారు. విషయం తెలుసుకున్న హుస్నాబాదు వైద్య సిబ్బంది గ్రామానికొచ్చి బాలింతకు వైద్య పరీక్షలు నిర్వహించి... గ్రామస్థులతో మాట్లాడి తల్లీ బిడ్డను ఇంటికి చేర్చారు. అపోహలకు పోకుండా బాలింతకు అండగా ఉండాలని కోరారు.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు