రవాణా సౌకర్యంలేని ఓ మారుమూల పల్లెలో జరిగే పెళ్లికి వచ్చే బంధువుల కోసం గ్రామస్థులంతా నడుంబిగించి రోడ్డును వేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బజార్‌హత్నూర్ మండలంలో మారుమూలన ఉన్న గిర్జాయి అనే గూడెం ... ఇటీవల నూతన గ్రామపంచాయతీగా అవతరించినప్పటికీ... రోడ్డు సౌకర్యం లేదు. కష్టంగా ఎడ్లబళ్లపై వెళ్లిరావడమే తప్ప... ఇతర వాహనాల రాకపోకలు సాగించడానికి సరైన మార్గమే లేదు. ఇదే గ్రామంలో ఏప్రిల్ ఒకటిన హన్మంతు అనే యువకుడికి ఆదిలాబాద్ గ్రామీణ మండలం బండగూడకు చెందిన వధువుతో పెళ్లి జరగాల్సి ఉంది.
బంధువుల వాహనాలు రావాలంటే మట్టితోవ ఇబ్బందికరంగా ఉందని గమనించిన గ్రామస్థులంతా నడుం బిగించారు. అడ్డదిడ్డంగా ఉన్న రాళ్లబండలను తొలగిస్తూ... రాకపోకలకు అనుకూలంగా మార్చుకున్నారు. అధికారులు స్పందించడం లేదనీ, ప్రజాప్రతినిధులు విస్మరించారని ... పట్టించుకోకుండా గ్రామస్థులే ఐక్యంగా రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలిచారు.
ఇదీ చదవండి: టీ పొడి అనుకొని ఎండ్రిన్ వేసుకుని.. మహిళ మృతి