ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకైక గ్రేడ్ -1 మున్సిపాలిటీగా ఉన్న ఆదిలాబాద్ పరిధిలో దాదాపు లక్షా 50వేల జనాభా ఉంది. ఇటీవల వార్డుల పునర్విభజన తరువాత.. 36 వార్డుల నుంచి 49 వార్డులకు పెరిగింది. రాజకీయంగా పదవులు రావడానికి ఇది దోహదపడుతుందే కానీ... మౌలిక వసతుల కల్పనలో మార్పు కనిపించడం లేదు. ఎన్నికల ముందు పట్టణ సుందరీకరణకు రెండు పద్దుల కింద ప్రభుత్వం... రూ.55 కోట్లు మంజూరు చేసినప్పటికీ విడుదలలో జాప్యం కారణంగా.. పనులు ముందుకు సాగడంలేదు.
సహానాన్ని పరీక్షిస్తోన్న రోడ్ల విస్తరణ పనులు
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కేంద్రాలైన అంబేడ్కర్ చౌక్, పంజాబ్ చౌక్, గాంధీ చౌక్, వినాయక్ చౌక్, నేతాజీ చౌక్‌ల్లో... ఆక్రమణలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. మందకొడిగా సాగుతున్న రోడ్ల విస్తరణ పట్టణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. పట్టణం మొత్తం మీద 250 నుంచి 300 కిలోమీటర్ల పక్కా రహదారుల అవసరం ఉంటే... ఇందులో 150 కిలోమీటర్లు కూడా సరైన రహదారి సౌకర్యం లేదు. మరో 600 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థకు గానూ... 300 కిలోమీటర్లు కూడా లేదు. చినుకు కురిస్తే చాలు... చిత్తడవుతున్న రహదారులతో జన జీవనం తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు.
పట్టణ శివారు ప్రాంతాలైన సుందరయ్యనగర్, రణదివేనగర్, సంజయ్‌నగర్, తాటిగూడ, మహాలక్ష్మివాడ, చోటాతలాబాబ్, ఖానాపూర్, షాద్‌నగర్, పిట్టలవాడ, భగత్‌సింగ్ నగర్ లాంటి కాలనీల్లోనైతే రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. గుంతలు తేలిన రహదారుల కారణంగా స్థానికులే ఎవరింటి ముందు వాళ్లే కాలువలు తవ్వుకొని మురికినీటిని బయటకు పంపించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వాహనదారులకే కాదు పాదచారులకూ ఇబ్బందులు తప్పడంలేదు. సుందరీకరణ అనే మాట ఈ ప్రాంతాల్లో కనిపించకపోవడం వల్ల పేదవాళ్లుండే కాలనీలను అభివృద్ధి చేయరా...?అనే అడుగుతున్న స్థానికుల ప్రశ్నకు సమాధానం చెప్పేవారే లేరు.
అధికారులు అంగీకరించారు
శివారు కాలనీల అభివృద్ధిపై మున్సిపాలిటీల పాలకవర్గం దృష్టి పెట్టలేదనే విమర్శ ఉంది. పనుల నిర్వహణలో జాప్యం జరుగుతోందని అధికారులూ అంగీకరిస్తున్నారు. అన్నివిధాలుగా అవస్థలతో వెనకబడిన... ఆదిలాబాద్ పట్టణంలో కనీస వసతుల కల్పనకు ప్రభుత్వం చేయూతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ నడవవు: కేటీఆర్