అధికారుల సిత్రాలు అన్నీ ఇన్నీ కాదు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం భీంసరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన కె.చిన్నయ్య గతేడాది జనవరి 26న గుండెపోటుతో మరణించారు. ఆయనకు తాజాగా ఎన్నికల్లో జైనథ్ మండలంలో ప్రిసైడింగ్ అధికారిగా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మావల మండలం సుభాష్‌నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎం.చంద్రమోహన్ అంధుడు. ఇతరుల సహాయం లేనిదే ముందుకు కదలలేని పరిస్థితి ఆయనది. అలాంటి వ్యక్తికి ఏకంగా బేల మండలంలో కీలకమైన ఏపీవో బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిలుపుదల
ఈ విషయాన్ని గుర్తించిన ఎంఈవో కార్యాలయ వర్గాలు ఆ ఉత్తర్వులు సంబంధీకులకు పంపకుండా నిలుపుదల చేశారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా మృతుడికి, అంధుడికి విధులు కేటాయించడం... ఒక్కొక్కరికీ రెండు చోట్ల డ్యూటీ వేయడం విమర్శలకు తావిస్తోంది. రెండు, మూడు విడతల ప్రాదేశిక ఎన్నికల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
" ఎన్నికల విధులపై దశల వారీగా శిక్షణ ఇస్తారు. విధుల కేటాయింపులను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తారు. అప్పటికీ మృతుడికి, అంధుడికి ఎన్నికల విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడం అధికారుల అలసత్వానికి తార్కాణం "