Teacher Transfer Process Issue in Adilabad : ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖలో పైరవీకారుల జోరు కొనసాగుతోంది. సర్దుబాటు నిబంధనలను పక్కనబెట్టి ఇష్టారీతిన డిప్యూటేషన్లు ఇవ్వడం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. కొందరు ఉపాధ్యాయులు రాజకీయ, ఆర్థిక, ఇతరత్రా పలుకుబడి ఉపయోగించి అనుకూలమైన చోటుకు బదిలీలు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లు, ముడుపుల ముట్టజేత వంటివి విద్యాశాఖను అబాసుపాలు చేస్తున్నాయి.
Teacher Transfer Became Controversial in Adilabad : ఉపాధ్యాయ కొరతను అధిగమించేందుకు గాను విద్యార్థులు తక్కువగా ఉన్న చోటు నుంచి ఎక్కువగా ప్రాంతాలకి అధ్యాపకులను సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో 122 మందిని సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అదనుగా కొందరు టీచర్లు జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలకు, ఇంటికి సమీపంలోని స్కూళ్లకు అనధికారికంగా పోస్టింగులు తెచ్చుకోవటం వివాదాస్పదమైంది. రాజకీయ ఒత్తిళ్లు, ఉపాధ్యాయ సంఘాల నేతల ప్రమేయం, ఎమ్ఈవో, డీఈవో కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో ఇష్టారీతిన బదిలీలు జరిగినట్లు ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.
"నిర్దిష్టమైనటువంటి నిబంధనల ప్రకారం చేయవల్సిన ప్రక్రియను డీఈవో గారు ఈరోడు పైరవీకారులు, రాజకీయనేతలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారిని తీసుకుని అర్హతలున్నటివంటి వారిని పక్కన పెట్టి, మిగిత వారికి అక్రమంగా డిప్యూటేషన్ కల్పించడం అన్నది గత రెండ సంవత్సరాలుగా ఆదిలాబాద్‌లో జరుకుతుంది." - వృకోధర్, డీటీఎఫ్ నాయకులు
వారికి మాత్రమే బదిలీలు: ఉపాధ్యాయుల సర్దుబాటు తతంగమంతా డీఈవో కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తూ పలు సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ఆందోళన బాట పట్టాయి. కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి డీఈవోపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో, క్రీడా పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు టీచర్లను రిలీవ్ చేసినట్లుగా పాత తేదీలు వేసి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయినప్పటికీ సదరు ఉపాధ్యాయులు మాత్రం క్రీడా పాఠశాలను వీడకపోవటంతో వారి వెనక ఉన్న అదృశ్య శక్తుల బలమేంటో ఇట్టే అర్థమవుతోంది. గాడి తప్పిన విద్యావ్యవస్థను ప్రక్షాళించే వరకు దశల వారీగా పోరు సాగిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే
"ఎక్కైడేతే ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడికి టీచర్స్ ఎక్కువ ఉన్న పాఠశాలల నుంచి బదిలీ చేస్తున్నాం. ఓరల్ డిప్యూటేషన్ ఇచ్చినవాళ్లని సబ్జెక్టు పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయమని చెప్పాము. కానీ కొందరు వాటిని ఒప్పుకోవడం లేదు అలాంటి వారికి జీతాలు అపమని చెప్పాం." - ప్రణీత, డీఈవో
సర్దుబాటులో పొరపాట్లు జరిగినట్టు డీఈవో ప్రణీత అంగీకరించారు. సంఘాల విజ్ఞప్తి మేరకు అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేస్తామని, ఉపాధ్యాయులు మొండికేస్తే వారి వేతనాలు నిలిపేయాలని ఎమ్‌ఈవోలను ఆదేశిస్తామని తెలిపారు. సర్దుబాటు సాకుతో విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాల బాగోతం విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Telangana Teachers Transfer : రాష్ట్రంలో 50 వేల మంది టీచర్లకు బదిలీ
Teachers Transfer: బదిలీల్లో ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు.. మూడు రోజుల్లోపు చేరాలని ఆదేశాలు..