కాలిక చెప్పుల్లేకుండా.. నాగుపాముల్లా వంకలు తిరుగుతూ అడవి మార్గంలో సాగిపొతున్న వీళ్లంతా మెస్రం వంశీయులు. నాగోబా జాతరలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి ఇలా తరలివెళ్లారు. తమతో పాటు చెట్టూ, పుట్ట, చేను పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జాతరకు శ్రీకారం చుడతారు. ఆత్మీయంగా పలకరించుకుంటూ ఏడాది పాటు ఎదురైన కష్టాలన్నీ మరిచి అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడుపుతారు. నియమ, నిష్టలను ప్రాణప్రదంగా భావించే మెస్రం వంశీయుల నాగోబా జాతరను ఘనంగా జరుపుకుంటారు.
ఏర్పాట్లలో మెస్రం వంశస్థులు
నాగోబా జాతర మెస్రం వంశీయుల జీవన విధానం.. వారి ఆచార వ్యవహారాలకు ఇదో నిలువుటద్దం. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవాళ్లైనా తరలివస్తారు. కొందరు ఎడ్లబళ్లపై చేరుకుంటారు. ప్రతిఏటా పుష్యమి శుక్లపక్షమి రోజున గంగాజలం కోసం 15 రోజుల పాటు కాలినడక సాగిస్తారు. గోదావరి జలాల సేకరణకు మంచిర్యాల జిల్లా జన్నారం పయనమయ్యారు. అక్కడ పవిత్ర గంగా జలాన్ని కడవల్లో నింపుకొని కేస్లాపూర్‌కు చేరుకుంటారు. పుష్యమి అమావాస్య రోజున అర్ధరాత్రి నాగదేవతను అభిషేకించి జాతర ప్రారంభిస్తారు.
నాగోబా జాతర కథేంటి?
ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం పూర్వం మెస్రం వంశీయుల్లో ఏడుగురు అన్నదమ్ములు కేస్లాపూర్‌లోని మేనమామ ఇంటికి వస్తారు. కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదనే కోపంతో తన తండ్రిని చంపడానికి వస్తున్నారని భావించిన కూతురు ఇంద్రాదేవి పెద్దపులిగా మారి ఏడుగురి అన్నదమ్ముల్లో ఆరుగురిని హతమారుస్తుంది. చివరివాడు నాగేంద్రుడిని వేడుకోవడంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్ చేరుకుంటాడు. తనను కాపాడిన నాగేంద్రుడిని తమ గ్రామంలోనే కొలువుతీరాలని కోరుకోగా వెలసిన దేవతనే కేస్లాపూర్ నాగోబాగా ప్రసిద్ధి పొందింది.
కేస్లాపూర్ వేదికగా నాగోబా జాతర
నాగోబా మహాపూజతోనే మెస్రం వంశీయుల ఏడాదికాలపు జీవన ప్రస్థానం ప్రారంభమవుతుంది. పెళ్లి, పేరంటం, మంచి, చెడులతోపాటు కర్మకాండలు చేసి దైవాన్ని పూజిస్తారు. చనిపోయినవారికి నాగోబా సన్నిధానంలో కర్మకాండ చేయనంతవరకు పుణ్యప్రాప్తి లభించదనేది మెస్రం వంశీయుల నమ్మకం. దైవసన్నిధి చేరిన పూర్వీకులు.. కేస్లాపూర్ వేదికగా నాగోబా దేవతగా అవతరించారని వారిని పూజిస్తే ఎలాంటి ఆపద రాదని విశ్వసిస్తారు.
ఇంద్రవెల్లిలోని ఇందిరా దేవి ఆలయంలో వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి. జనవరి 21న గంగాజలం కోసం కాలినడకన వెళ్లిన మెస్రం వంశస్థులు ఇంద్రవెల్లి చేరుకున్నారు. ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వంటలతో నైవేద్యాలు సమర్పించారు.
ఇదీ చదవండి: కళలు, సంస్కృతులకు పట్టం కడతాం: శ్రీనివాస్ గౌడ్