కుంట అశోక్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ గ్రామం. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంతకీ ఈయన ప్రత్యేకత ఏంటంటే... మనకేదైనా ఫోన్ నంబరు కావాలంటే సాధారణంగా చరవాణి తీసి వెతుకుతుంటాం. ఈయన మాత్రం అలా వెతకడు. ఒక్కసారి నంబరు చెబితే చాలు... ఆ తర్వాత ఆయన ఫోన్ చూడకుండా నంబరు చెప్పగలడు. గ్రామంలో ఎవరికి అవసరమొచ్చినా ఈయన్నే నంబరు అడుగుతుంటారంటే ఆయన ప్రత్యేకత అలాంటిది. ఇంతకీ ఆయన ఎలా నెంబర్లు చెబుతాడంటే..
జందాపూర్ టెలిఫోన్ డైరెక్టరీ
గ్రామంతో పాటు పొరుగు గ్రామస్థుల నంబర్లు కలుపుకుని మొత్తం వందకు పైగానే నోటికి చెప్పేస్తుంటాడు అశోక్. చరవాణి చూడనిదే ఇంట్లో వారి నంబరు గుర్తుపెట్టుకోని ప్రస్తుత పరిస్థితిలో అశోక్ ఏకంగా వందల సంఖ్యలో చరవాణి నెంబర్లతో పాటు ద్విచక్రవాహన, ఆటోల నెంబర్లు చెబుతుండటం విశేషం. అంతేకాదు సాధారణంగా మాట్లాడే తెలుగు వాడుకభాషను ఆయన తడుముకోకుండా రివర్స్‌లో మాట్లాడగలడు. తనతో పాటు ఇంట్లో వారికి నేర్పించాడు. తన స్నేహితుడు దయాకర్‌తోనూ అనర్గళంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంతటితో ఆగడా అంటే అదీలేదు సుమా. గ్రామాల్లో వీధీ నాటకాలకు ఇప్పుడు ఆదరణ ఉంది. వాటికి వన్నె తగ్గించకుండా రామాయణం నాటకంలో లక్ష్మణుడి వేషాధారణతోనూ అలరిస్తున్నాడు. ఆయన ప్రతిభను చూసి గ్రామస్థులు మా ఊరు ఆణిముత్యమని అశోక్‌ని కొనియాడుతున్నారు.
చిన్నప్పటి నుంచి మా స్నేహితుడు. అతని చిన్నతనం నుంచే మంచి విద్యార్థి. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు ఆపేశాడు. అంతే కాకుండా తెలుగులోనూ రివర్స్‌లో మాట్లాడాడు. ఎవరి ఫోన్ నంబరు అడిగినా... ఇట్టే చెప్పేస్తాడు. ఈ అశోక్ జందాపూర్ టెలిఫోన్ డైరెక్టరీ. నాటక కళా ప్రదర్శన కూడా చేస్తాడు. నాటకంలో లక్ష్మణుడి వేషమేస్తాడు. మంచి కళాకారుడు. ఈయన మా జందాపూర్ ఆణిముత్యం.
- గ్రామస్థులు
నాకు ఒకసారి నంబరు చూడగానే నోటికి వచ్చేస్తుంది. నాకు 80 నుంచి 100 వరకు నంబర్లు గుర్తుంటాయి. అంతే కాకుండా ఆటో నంబర్లు, బైకుల నంబర్లు కూడా గుర్తుంటాయి. నేను కేవలం ఇంటర్ వరకే చదివాను. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు ఆపేశాను.
- అశోక్, ఆటో డ్రైవర్
అశోక్ ప్రతిభే నిదర్శనం
ఇంటర్ వరకు చదివిన తాను ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. ఉన్నత చదువులు చదలేక పోయానని చెబుతున్నాడు అశోక్. తన మూడేళ్ల కుమారుడిని ప్రయోజకుడిని చేస్తానని చెబుతున్నాడు. సాంకేతిక ప్రభావం అధికంగా ఉన్న ఈ రోజుల్లో సొంత పరిజ్ఞానాన్ని మించిందిలేదని ఆటో డ్రైవర్ అశోక్ ప్రతిభే నిదర్శనం.
ఇదీ చదవండి: నలుగురు పిల్లల తల్లితో యువకుడి 'ప్రేమ వివాహం'