రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్ని జలమయం కాగా... రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
దిక్కుతోచని పరిస్థితి...
జిల్లాలోని నేరడిగొండ మండలం రాజుల తండా గ్రామంలో ఎడతెరపి లేని వర్షంతో ఓ గర్భిణి తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్రామానికి చెందిన గర్భిణీ అనితకు మధ్యాహ్నం సమయంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రసవానికి నేరడిగొండ మండల కేంద్రానికి తరలించాల్సిన పరిస్థితి. అసలే అంతంతమాత్రంగా ఉన్న దారి.. ఆపై వర్షపు నీటితో అతలాకుతలం.. అందులోనూ పొంగుతున్న వాగు.. బయట చూస్తేనేమో ఆగని వాన.. ఇంట్లోనేమో ఎక్కువవుతున్న నొప్పులు.. దిక్కుతోచని పరిస్థితిలో కుటుంబసభ్యులు ఓ నిర్ణయానికి వచ్చారు.
తీసుకెళ్లేందుకు వచ్చిన ఆటో గల్లంతు...
ఆలస్యం చేయకుండా.. అందుబాటులో ఉన్న తమ ఎడ్లబండిపై తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. వర్షంలో... గతుకుల దారిలో... ఎడ్ల బండిపైనే గర్భిణీని వాగు వరకు తరలించారు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఎడ్ల బండితో దాటటం కష్టమని భావించి.. ఓ ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేశారు. హుటాహుటిన వాగు దగ్గరికి చేరుకుంది. అటువైపున ఉన్న ఎడ్లబండి వద్దకు చేరుకునేందుకు వాగు దాటుతుండగా.. వరద ఉద్ధృతికి ఆటో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు.. అతి కష్టం మీద ఆటోను ఒడ్డుకు తీసుకొచ్చారు.
108లో ఆస్పత్రికి...
ఇలా అయితే కాదని.. ధైర్యం చేసిన కుటుబంసభ్యులు... ఎడ్లబండి పైనే గర్భిణీని దాటించేందుకు నిశ్చయించుకున్నారు. కష్టంతో కూడుకున్న పనైనా... ఎంతో జాగ్రత్తగా ఎడ్లబండిని వాగు దాటించారు. అంతకు ముందే కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. కాసేపట్లోనే వాగు దగ్గరికి 108 వాహనం వచ్చిన... గర్భిణీని నేరడిగొండ మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి తరలించింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు.. గర్భిణీని పరిశీలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. నొప్పులు తగ్గాయని.. ప్రసవానికి సమయం ఉందని తెలిపారు.
ఇవీ చూడండి:
- LIVE UPDATES: గర్భిణీని తీసుకెళ్లేందుకు వస్తున్న ఆటో వాగులో గల్లంతు
- Pregnant Delivery: అసలే వర్షం.. అందులోనూ పొంగుతున్న వాగు.. దాటేలోపే ప్రసవం..
- Telangana Heavy Rains: రాష్ట్రంలో రాగల మూడురోజులు అతి భారీ వర్షాలు!
- Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: సీఎం కేసీఆర్