ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డు ప్రాంతాల్లో పంచాయతీరాజ్ విస్తరణ (పెసా) చట్టాన్ని ఉపయోగించి తీర్మానాలు చేయడంతో ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటు యోచనను విరమించుకుంది. మద్యం వల్ల వ్యక్తులు, కుటుంబాలు గుల్లయిపోతుండడంతో ఆదివాసీలు సమరశంఖం పూరించారు. ఆదివాసీ పెద్దలు, మేధావులు, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు చర్చించుకున్నారు. పెసా చట్టానికి అనుగుణంగా గత నెల నుంచి ఊరూరా గ్రామసభలు నిర్వహించారు.
మద్యం దుకాణాలు ఎత్తివేయాలని తీర్మానాలు
తొలిసారిగా కుమురం భీం జిల్లాలోని జైనూరు, సిర్పూరు(యు), లింగాపూర్ మండలాల్లో మద్యం దుకాణాలు ఎత్తివేయాలని తీర్మానాలు చేశారు. వాస్తవంగా పెసా గ్రామసభ తీర్మానం లేనిదే ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదు. కానీ చట్టాలొచ్చి ఏళ్లు గడిచినా ఆదిమజాతులకు అవగాహన లేక అవి మరుగున పడ్డాయి. ఇప్పుడు పెసా చట్టాన్ని మద్యంపై ప్రయోగించడంతో ప్రభుత్వం కూడా మూడు మండలాల్లో మద్యం దుకాణాలు ఎత్తివేసింది. కొత్త దుకాణాలనూ ఏర్పాటు చేయలేదు. ఆయా ప్రాంతాల్లో సారాను కూడా రానీయకుండా కఠినంగా వ్యవహరిస్తామని ఆదివాసీ సంఘాలు ప్రతినబూనాయి.
ఇదీ చూడండి : సమ్మెకు మద్దతుగా... 30న సకల జనుల సమర భేరి