ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం నాగోబా జాతర.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవతకు శుక్రవారం రాత్రి మెస్రం వంశస్థులు మహాపూజలను నిర్వహించి జాతరను ఘనంగా ప్రారంభించారు. తొలుత ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా డోలు వాయిస్తూ, కాలికోమ్‌ను ఊదుతూ, ఇతర వాయిద్యాలతో ఆలయానికి చేరుకున్నారు. మహిళలు తెల్లని వస్త్రం ధరించి ఆవుపేడ బుట్టలను తలపై పెట్టుకొని ఆలయం వద్దకు వచ్చారు. అనంతరం ఇచ్చోడ మండలం సిరికొండ గ్రామంలో గుగ్గిల స్వామి అనే కుమ్మరి వద్ద తయారు చేయించిన మట్టి కుండలను వారు తీసుకొచ్చారు. వాటిల్లో నాగోబా పూజలకు కావల్సిన నీటిని మర్రిచెట్ల వద్ద ఉన్న కోనేటి నుంచి తెచ్చి ఆలయాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా డోలు, కిక్రి వాద్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న మెస్రం వంశస్థులు భారీగా తరలివచ్చారు.
జిల్లా పాలనాధికారి దివ్వా దేవరాజన్ నాగోబా ఆలయం ప్రాంగణంలో పూజలు చేసి గిరిజనుల స్థితిగతులను వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ.. మెస్రం వంశీయులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలంగించాలని డిమాండ్ చేశారు. జాతరలో నిర్వహించే దర్బారులో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నాగోబా జాతర: గంగాజలం కోసం కొండలు ఎక్కుతూ.