Laughing Club In Adilabad District : ఉరుకుల పరుగుల జీవనం, మారుతున్న జీవనశైలి వల్ల రోజురోజుకీ ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతోంది. ప్రజల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ కోవలోకి చెందిందే లాఫింగ్ క్లబ్. కొందరు మహిళలు రోజూ ఒకచోట చేరి నవ్వుతూ, వ్యాయామం చేస్తూ సందడి చేస్తున్నారు. జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా మార్చుకుంటున్న ఈ వనితల కథేంటో చూద్దాం రండి.
Adilabad Laughing Club : నవ్వు నాలుగు విధాల మంచిదనేది నానుడి. అనేక కారణాల రీత్యా రోజూ మనస్ఫూర్తిగా కాసేపు నవ్వుకునే తీరిక లేకుండా పోతుంది. ఇప్పటికే మెట్రో నగరాలు, విదేశాల్లో లాఫింగ్ క్లబ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి స్ఫూర్తితోనే ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్ పార్కులో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
పోటీ పడి విన్యాసాలు.. దిల్లీ వాస్తవ్యురాలైన మధుసింగల్ ఏడాది కింద లాఫింగ్ క్లబ్ ప్రారంభించారు. ఐదుగురితో ప్రారంభమైన ఈ క్లబ్‌లో ఇప్పుడు 55 మంది మహిళలు చేరారు. యువతుల నుంచి గృహిణులు, 60 ఏళ్ల పైబడిన వారు లాఫింగ్ క్లబ్‌లో చేరటం విశేషం. ఒకరికొకరు పోటీ పడి విన్యాసాలు చేస్తున్న వారి ఉత్సాహం చూస్తుంటే అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అనిపించక మానదు.
ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది.. ఇల్లాలు బాగుంటే ఇంటి సభ్యులు బాగుంటారు. ఇల్లు బాగుంటేనే మెరుగైన సమాజం సాధ్యమవుతుంది. ఈ సత్యాన్ని నమ్మిన మహిళలు రోజూ గంట సమయం నవ్వుతూ, యోగాసనాలు చేస్తున్నారు. రోజూ 45నిమిషాల పాటు నవ్వటం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకుంటున్నామని మహిళలు అంటున్నారు. శారీరక వ్యాయామం, యోగా వల్ల ఆయా నొప్పులు దూరమై ఆరోగ్యం మెరుగవుతోందని చెబుతున్నారు. తల్లిదండ్రుల ప్రోద్బలంతో లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన మధుసింగల్... ఆసక్తి ఉన్నవారు ఉచితంగా ఈ క్లబ్‌లో పాలుపంచుకోవచ్చని తెలిపారు.
ప్రపంచంలో కెల్లా అన్నింటిని మించిన సంపద ఆరోగ్యమే. దాన్ని కాపాడుకునేందుకు ముందుకొచ్చిన మహిళలంతా మనకు ఆదర్శమూర్తులే...ఆచరిస్తే మనమూ ఆరోగ్యవంతులవుతాం. మరి మీరెప్పుడు ఈ లాఫింగ్ క్లబ్‌లో చేరుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా లాఫింగ్ క్లబ్‌లో చేరండి. ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.
ఇవీ చదవండి: