దళితబంధు పథకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఆ పథకాన్ని ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌కే (Huzurabad) పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని ఎస్సీలకు ఫలాలు అందాలని అన్నారు. కేవలం ఉపఎన్నిక ఉన్న నియోజకవర్గాలకే పరిమితం కాకూడదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత, గిరిజనులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇస్తవా-చస్తవా
'హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే దళిత బంధు పథకం తెచ్చినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తేవాలంటే ఉప ఎన్నికలు రావాలి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇస్తవా-చస్తవా అనే నినాదంతో మేము ముందుకెళుతున్నాం. ప్రజల తరఫున మేం ప్రభుత్వంతో కొట్లాడతాం. తెరాస ఎమ్మెల్యేలు ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి రూ.10 లక్షలు ఇప్పించాలి. లేదంటే రాజీనామా చేయాలి. అలా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అందరికీ ప్రయోజనం జరుగుతుంది. గత ఏడేళ్లుగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం, జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డల మీద ఉంది.'
-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
అత్యంత ఖరీదైన ఉపఎన్నిక
దళిత బంధుకు ప్రత్యామ్నాయంగా తాము ఇంద్రవెల్లి సభ నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఎస్సీలు, గిరిజనులకు ఏడేళ్లుగా జరుగుతున్న అన్యాయాలను తెలిపేందుకే సభ పెట్టినట్లు తెలిపారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందరూ కాంగ్రెస్ నేతల సమన్వయంతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా... అది పార్టీ సమష్టి నిర్ణయమే అని చెప్పారు. హుజూరాబాద్ (Huzurabad) ఎన్నికల రేసులో కాంగ్రెస్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నిక హుజూరాబాద్ (Huzurabad)ఉప ఎన్నిక అవుతుందని అన్నారు. ఏదైనా పోటీ పెడితే హుజూరాబాద్ ఉపఎన్నిక గిన్నీస్ రికార్డు కొడుతుందని చెప్పారు. వందల కోట్లు ఖర్చు పెట్టాలని తెరాస, భాజపా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
కోవర్టులు లేరనే అనుకుంటున్నా
కాంగ్రెస్‌లో కోవర్టులు ఇక లేరనే అనుకుంటున్నానని రేవంత్ (Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఐక్యత లేదన్న వైఎస్ షర్మిల వ్యాఖ్యలు అసత్యాలని చెప్పారు. సోదరుడి ఆదరణ కోల్పోయి షర్మిల ఆవేదనతో మాట్లాడుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌పై గౌరవంతో ఆమెపై ప్రత్యారోపణలు చేసే ఉద్దేశంలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి : రేవంత్ రెడ్డి