కొవిడ్ పాజిటివ్ కేసుల విషయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, ఆదిలాబాద్ జిల్లా శాఖ విడుదల చేస్తున్న నివేదికలు పొంతన లేకుండా ఉంటున్నాయి. ఈ నివేదికలతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్ర శాఖ విడుదల చేస్తున్న నివేదికలకు జిల్లా వైద్యారోగ్య శాఖ విడుదల చేస్తున్న నివేదికల్లో భారీ తేడాలు ఉండటం దీనికి కారణంగా మారింది. వీటిలో ఏ నివేదికలను నమ్మాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేస్తున్న నివేదికలను టీవీల్లో చూసిన ప్రజలు, అనంతరం జిల్లా నివేదికల వివరాలను పరిశీలించి ఇదేలా సాధ్యమని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి రాఠోడ్ నరేందర్‌ని ప్రశ్నిస్తే తాము విడుదల చేస్తున్న నివేదికలు కచ్చితమైనవని పేర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాతిపదికన నివేదికలిస్తున్నారో తమకు సమాచారం లేదని స్పష్టం చేశారు.