సరిగ్గా పక్షం రోజుల కిందట ఉట్నూర్‌కు చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రాగా కుటుంబీకులు అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్(Adilabad Rims)కు తరలించారు. ఆమెను వార్డుకు తీసుకెళ్లగా ప్రసూతి చేయాల్సిన వైద్యులు పట్టించుకోలేదు. గర్భిణి అంబులెన్సులోనే ఉందనే విషయం తెలుసుకున్న జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ (Zp Chairman Janardhan Rathod) రిమ్స్‌కు వచ్చి ప్రసూతి విభాగంలో వాకబు చేస్తే అందుబాటులో ఉన్న ఓ వైద్యురాలు స్పందించలేదు. సరికదా జడ్పీఛైర్మన్‌తోనే వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. ఆయన వార్డు నుంచే డైరెక్టర్ డా.కరుణాకర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈలోగా గర్భిణి అంబులెన్సులోనే ప్రసవించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో జడ్పీఛైర్మన్ వెళ్లిపోయారు.
కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యుడికీ చేదు అనుభవం..
తలమడుగు మండలానికి చెందిన ఓ ఆదివాసీ మహిళ గర్భసంచి శస్త్రచికిత్స విషయమై రిమ్స్(Adilabad Rims) వైద్యులు సకాలంలో స్పందించలేదు. విషయమై తెలుసుకున్న కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యుడు గోక గణేశ్‌రెడ్డి (Congress Zptc Goka Ganesh reddy)రిమ్స్‌కు వెళ్లి ఆరాతీస్తే వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. కిందిస్థాయి వైద్యుల నిర్లక్ష్యాన్ని గైనిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీగా పనిచేస్తున్న డా. పద్మిని దృష్టికి తీసుకెళ్లారు. స్పందించాల్సిన ఆమె స్పందించకపోగా నువ్వెవరు? నీకేం పని? మీ ఇష్టం వచ్చినవారికి ఫిర్యాదు చేసుకోండి? అంటూ అమర్యాదగా మాట్లాడారని స్వయంగా గణేశ్‌రెడ్డి ఈనెల 23న జరిగిన జడ్పీసర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఈ విషయంపై రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నుంచి గానీ, జిల్లా కలెక్టర్ నుంచి ఎలాంటి ఊరడింపు లభించలేదు.
సామాన్యుల పరిస్థితి ఏంటీ?
రిమ్స్‌లో వైద్యుల పనితీరు విమర్శలకు తావిస్తోంది. కొన్ని సందర్భాల్లో వివాదస్పదమవుతోంది. స్వయంగా అధికార పార్టీకి చెందిన కీలకనేత, జిల్లా పరిషత్ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన మరోనేత గణేశ్రెడ్డిలనే వైద్యులు పరిగణలోకి తీసుకోలేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగానైతే జిల్లా పాలనాధికారి అధ్యక్షన ఆసుపత్రి సమీక్ష సమావేశం క్రమం తప్పకుండా జరిగితే కొంత ఉపయుక్తంగా ఉంటుంది. కానీ జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్ల రిమ్స్ పాలన పట్టుతప్పుతోంది.
నెరవేరని సర్కార్ ఆశయం...
రాష్ట్ర విభజనకంటే ముందే ఉమ్మడి జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ కేంద్రంగా 500 పడకలతో 155 వైద్య పోస్టుల మంజూరుతో రిమ్స్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో 97 మంది వైద్యులే చేరడం వల్ల 58పోస్టులు భర్తీకాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017లో విడుదలైన జీవో 78 ప్రకారం మరో 60 వైద్యపోస్టులను మంజూరుచేయగా కేవలం ఒక్కరే విధుల్లో చేరారు. మిగిలిన 59 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. అంటే ఇప్పుడు 98 మంది వైద్యులు పనిచేస్తున్నారు. దీన్ని అలసుగా తీసుకున్న వైద్యులు పనిభారం పేరిట అసలు విధులకే ఎగనామం పెడుతుండటంతో పేదలకు సర్కారు వైద్యం అందించాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరకుండాపోతోంది.
కొత్తగా కాల్ డాక్టర్...
రిమ్స్ ఏర్పడిన తొలినాళ్లలోనే విధుల నిర్వహణ, స్టే డ్యూటీ మార్గదర్శకాల కోసం ప్రభుత్వం జీవో నంబర్ 31ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి వైద్యుడు తప్పనిసరిగా ఎనిమిది పనిగంటల విధులు నిర్వహించాల్సిందే. అంటే ఉదయం 8 నుంచి 4 గంటల వరకు అందుబాటులో ఉండాలి. ఇంటర్నల్ రోస్టర్ విధానానికి అనుగుణంగా 24 గంటల పాటు డిపార్ట్‌మెంట్‌కు ఒక సీనియర్ వైద్యుని చొప్పున రిమ్స్‌లోని 13 డిపార్ట్‌మెంట్ల నుంచి 13 మంది అందుబాటులో ఉండాలి. తద్వారా ఏ సమయంలో ఎలాంటి రోగి వచ్చిన వెంటనే వైద్యం అందించే వీలుంటుంది. కానీ ఇది అమలు కావడంలేదు. ఉదయం 9 గంటలకు రావడం మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.
ఇష్టమోచ్చినట్లు...
నిబంధనల ప్రకారం జరగాల్సిన స్టే డ్యూటీకి బదులుగా స్థానిక వైద్యులు తమకు ఇష్టమైనట్లుగా కాల్ డాక్టర్ విధానాన్ని అమలుచేస్తున్నారు. అంటే సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండరు. అత్యవసరంగా ఎవరైనా ఆసుపత్రికి వస్తే జూనియర్లు పరిశీలించిన తరువాత సీనియర్లకు సమాచారం అందించి అంబులెన్స్‌ను పంపించి పిలిపించే విధానం కొనసాగుతోంది. ఈలోగా రోగికి జరగరానినదేదైనా జరిగితే అదే ఆయన కర్మ అన్నట్లే తప్ప వైద్యుల తప్పిదమేమీలేదన్నట్లుగా సాగుతోంది.
కొంతమంది భేష్...
వేళ్లమీద లెక్కపెట్టగలిగిన కొంతమంది వైద్యుల పనితీరు బాగానే ఉంది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఒత్తిడికి లోనుకాకుండా పనిచేయడమే కాకుండా పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ప్రైవేటు క్లీనికల్ వస్తే రిమ్స్‌లోనే ఖర్చులేకుండా అవుతుందని వెన్నుతట్టి భరోసా ఇస్తారు. విధులకు గైర్హాజరైతే నిజాయతీగా సెలవు పెడతారు. ఇన్‌పేషంట్లుగా ఉన్నవారి విషయంలో పేరుపెట్టి పలకరిస్తూ ఓదార్పునిస్తారు. ఇటీవల పాముకాటుకు గురైన ఓ మహిళ ప్రాణాపాయస్థితికి చేరుకోగా ఓ మహిళా వైద్యురాలితోపాటు మరో వైద్యుడు అత్యంత జాగ్రత్త తీసుకొని ప్రాణం పోశారు.
పేదలను పట్టించుకోరు...
రిమ్స్ ఆసుపత్రి పేరుకే పెద్దది. కానీ పేదలకు సరైన వైద్యం అందడంలేదు. పెద్ద డాక్టర్లను మాట్లాడియాలంటే భయమేస్తది. ఒకసారి ఆపరేషన్ థియేటర్లో ఉన్నారంటారు. ఇంకోసారి వార్డులో మరోసారి ఓపీలో ఉన్నారంటారు. కానీ ఎక్కడా అందుబాటులో ఉండరు. అదే ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రం టైం ప్రకారం చూస్తరు. రూ.లక్షలచొప్పున సర్కారు జీతం తీసుకునే వైద్యుల పనితీరుపై పర్యవేక్షణ చేయాలి.
-- గజానన్, స్థానికుడు
నిర్లక్ష్యానికి నిదర్శనమిది...
అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం రక్త పరీక్షల కేంద్రం నిర్వహణ తీరు. దాదాపుగా 500 పడకలకు రక్త పరీక్షల నిర్ధరణలో కీలకమైన సెల్ కౌంటర్ తరుచూ మరమ్మతులకు గురవుతోంది. పరికరాలు పనిచేయడానికి అవసరమైన రసాయనాలు సైతం సరిగా సరఫరా కావడంలేదు. ఫలితంగా పరీక్షల నివేదకలు రావడానికి జాప్యం జరగడంతో సరైన వైద్యం అందించడానికి అవరోధం ఏర్పడుతోంది.
ఇదీ చూడండి: rims: ఆదిలాబాద్ రిమ్స్‌కు శస్త్ర చికిత్స అవసరం..!
Jobs for sale: అమ్మకానికి ఉద్యోగాలు.. ఆదిలాబాద్ రిమ్స్‌లో దళారుల చేతివాటం