Employees protests in Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలో తప్పులు దొర్లాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంత కేటాయింపుల్లో స్పష్టత కొరవడటం ఆ ప్రాంత ఉపాధ్యాయులు, జాబితాలో తమకు తగు ప్రాధాన్యం ఇవ్వలేదంటూ వితంతువులు, ఒంటరి మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై నోడల్ అధికారి సిక్తా పట్నాయక్‌ను కలసి విన్నవించారు. శాఖల వారీగా కేటాయింపులకు సంబంధించి సీనియారిటీ జాబితాలు ప్రదర్శించకపోవడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
సీనియారిటీ జాబితా ఇవ్వాలి
సీనియారిటీ ప్రకారం నేను ముందున్నా.. నా తర్వాతి వారికి స్థానికంగా అవకాశం కల్పించారు. నేను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకున్నాను. కొత్త జీవోతో పిల్లల చదువులకు ఇబ్బంది ఎదురవుతుంది. -ఉద్యోగిని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
ఉద్యోగుల సీనియారిటీ జాబితాను శాఖల వారీగా ప్రదర్శించకుండా అంతర్గతం కాగానే బదిలీలు చేపట్టారు. ఇవన్నీ తప్పుల తడకగా ఉంటున్నాయి. వితంతువులకు కూడా కొత్త జీవో 317 వర్తించడం లేదు. కారుణ్య నియామకాలకు వర్తింపజేస్తున్నారు. జీవో నెం. 3 ప్రకారమే ఏజెన్సీలో ఉద్యోగుల సర్దుబాటు జరగాలి. విద్యాశాఖకు ప్రత్యేక ఉత్తర్వులిచ్చి.. సర్దుబాటు చేపట్టాలి. ఈ విషయమే నోడల్ అధికారి సిక్తా పట్నాయక్‌ను కలిశాం. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. -ఉద్యోగులు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే
జిల్లాలో ఉద్యోగుల సర్దుబాటు ప్రకారం వైద్య పరీక్షల్లో వైద్యులు నిర్ధరించిన అంశాన్నే పరిగణనలోకి తీసుకున్నామని సంబంధిత అధికారి చెప్పారు. ఇందుకు సంబంధించి అనుమానాలు ఉంటే పరిశీలించుకోవచ్చన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే.. బదిలీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Local cadre Report: సొంత జిల్లాలకు ఉద్యోగులు... తొలిరోజు 25 శాతం మంది రిపోర్ట్