పల్లెల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా నేరుగా నిధులు విడుదల అవుతున్నాయి.. గ్రామాల్లో వివిధ పన్నుల రూపేణా వచ్చిన సాధారణ నిధులు సైతం ఉంటాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మంజూరయ్యే నిధులు.. చేస్తున్న ఖర్చు లెక్కలు పక్కాగా ఉంటేనే నిర్దేశించిన లక్ష్యం నెరవేరుతుంది.. ఇలా జరగాలంటే ఆడిట్ సరిగా జరగాలి. ఇందుకోసం పంచాయతీల్లో ఈ-ఆడిట్ విధానానికి శ్రీకారం చుట్టారు.
ప్రజలందరికీ అందుబాటులో...
గతంలో ఏడాదికోసారి ఆడిట్ అధికారులు తనఖీ చేసి జిల్లా, మండల, పంచాయతీల కార్యాలయాలతో పాటు ఆడిట్ కార్యాలయానికి ఆడిట్ పూర్తయిన పత్రాలు పంపించేవారు. నిధుల వివరాలు ఇతరులకు తెలిసే అవకాశం లేదు.. ఈ-ఆడిట్ వల్ల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల లెక్క పారదర్శకంగా ఉంటుంది. మొదటి విడతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 370 పంచాయతీలను ఎంపిక చేశారు. వీటిలో 2019-20 ఆర్థిక సంవత్సరం ఖర్చులను ఈ-ఆడిట్ విధానంలో అమలు చేయనున్నారు...
అక్రమాలకు అడ్డుకట్ట...
గ్రామాల్లో జరిగే వివిధ అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.. .ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఖర్చు చేయకపోవడం వల్ల ఇవి చోటు చేసుకుంటున్నాయి ఈ-ఆడిట్ విధానం వల్ల ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.. ఆడిట్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉన్నందున అధికారులు ముందు నుంచే నిధుల వినియోగంపై దృష్టి సారించే అవకాశం ఉంది.. ప్రతీ పంచాయతీకి ఆన్‌లైన్‌లో ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. ఆడిట్ చేయాల్సి వచ్చినప్పుడు నేరుగా రాష్ట్ర ఆడిట్ అధికారులు పంచాయతీకి లింక్ ఇస్తారు. ఇందులో పూర్తి వివరాలు ఆడిట్ అధికారులు సమక్షంలో నమోదు చేస్తారు. ఈ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచడం వల్ల అందరికి అందుబాటులో ఉండి పారదర్శకతకు తోడ్పడుతుంది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎంపిక చేసిన పంచాయతీల్లో ఈ-ఆడిట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.దీనివల్ల పారదర్శకత పెరగడంతో పాటు నిధులు సద్వినియోగం అవుతాయి. పంచాయతీకి సంబంధించిన లెక్కలన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉంటాయి.
- ఎ.ఫణిందర్‌రావు, డీఎల్‌పీఓ బెల్లంపల్లి
ఆడిట్ అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్న (మాన్యువల్) చిత్రమిది. గతంలో జమ, ఖర్చు చేసిన నిధులను పంచాయతీ అధికారులు చూపించే రికార్డుల ఆధారంగా తనిఖీ చేసేవారు. ఈ-ఆడిట్ విధానం వల్ల మంజూరు, ఖర్చు వివరాలు పారదర్శకంగా ఉంటాయి.
ఇదీ చదవండిః పొరుగుసేవల ఏజెన్సీల ఎంపికలో నిబంధనల ఉల్లంఘన