ఆదిలాబాద్ జిల్లా తెరాస నేతల్లో మునుపటి సఖ్యత కనిపించడంలేదు. ఎవరిదారి వారిద్నట్లుగానే సాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలకుగానూ ఆసిఫాబాద్ స్థానం మినహా మిగిలిన తొమ్మిది స్థానాల్లో తెరాసనే విజయం సాధించింది. కాంగ్రెస్ తరఫున ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కు కూడా గులాబీ దళంలో చేరడం వల్ల ఇక తెరాసకు ఎదురు లేకుండా పోయింది. కేసీఆర్ తొలి కేబినెట్లో జిల్లా నుంచి జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రులుగా స్థానం లభించింది. రెండోసారి జోగు రామన్నకు అవకాశం దక్కకపోవడం వల్ల అంతర్గతంగా కాస్తంత అసంతృప్తికి దారితీసింది.
నేతల వ్యవహారశైలి
పార్లమెంటు ఫలితాలతో ఎవరిదారి వారిదన్నట్లుగా తయారైంది నేతల వ్యవహారశైలి. తన ఓటమికి సొంతపార్టీ నేతల రాజకీయమే... కారణమని గోడం నగేశ్ ఆరోపించడం వల్ల తెరాస నేతల మధ్య మరింత దూరం పెరిగింది. ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నేతలంతా ఒకటే మాటగా సాగిన రాజకీయం... క్రమంగా ఒకరంటే ఒకరికి గిట్టని స్థాయికి చేరుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
భగ్గుమనేరీతిలో వైరం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సార్సాల ఘటనలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సొదరుడు... కోనేరు కృష్ట ప్రధాన నిందితుడిగా.. జైలుకు వెళ్లడం తెరాసనేతల మధ్య వైరాన్ని మరింత పెంచింది. ప్రధానంగా రాజకీయ గురుశిష్యులుగా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి-కోనేరు కోనప్ప మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేరీతిలో వైరం పెరిగింది. ఇటీవల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిహోదాలో పాల్గొనగా... కోనప్ప నేతృత్వంలో సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులెవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వర్గాలను ప్రోత్సహిస్తున్న తీరు
కేసీఆర్ తొలి కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి మధ్య ఇప్పుడు సఖ్యత లేదనే విషయాన్ని అధిష్ఠానం గుర్తించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతోనే పార్లమెంటు స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని నిర్ధరణకు వచ్చిన తెరాస... నేతల సఖ్యతకు యత్నిస్తోంది. ఇటీవల జిల్లాల పర్యవేక్షకులను నియమించిన అధిష్ఠానం... నేతలు వర్గాలను ప్రోత్సహిస్తున్న తీరు, ద్వితీయశ్రేణి నేతలపట్ల వ్యవహరిస్తున్న విషయాన్ని అంతర్గతంగా ఆరాతీయడం ప్రాధాన్యతాంశంగా మారింది. జిల్లా నేతలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు లోబడి... తీసుకుంటున్న నిర్ణయాలు ద్వితీయశ్రేణి నేతలకు తలనొప్పిగా తయారువుతోంది. ఏ ఎమ్మెల్యేను కలిస్తే... ఎవరు ఏమనుకుంటారోననే అభద్రతభావం నెలకొంది. తాజాగా మంత్రివర్గ విస్తరణపై పార్టీలో అంతర్గతంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం... జిల్లా నేతల వ్యవహారశైలిపై పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు సంకేతాలు రావడం... జిల్లా రాజకీయ అసమ్మతికి అద్దంపడుతోంది.
ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు