Decrease cotton prices: తెల్లబంగారంగా పేరొందిన పత్తి క్రయవిక్రయాలకు ఖండాంతర ఖ్యాతిగడించిన ఆదిలాబాద్ మార్కెట్‌లో... ధరలు పతనమై రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల సిండికేట్‌గా మారిన వ్యాపారులు ఏకపక్ష నిర్ణయాలతో ధరలను నేలకు దించుతున్నారు. మద్దతు ధరకంటే ఎక్కువే చెల్లిస్తున్నామనే అంశాన్ని తెరపైకి తెస్తున్న వ్యాపార వర్గాలకే... మార్కెటింగ్‌శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోందితప్ప అంతర్జాతీయ మార్కెట్ సరళికి అనుగుణంగా రైతులకు మేలు చేయాలనే ప్రయత్నం చేయడంలేదు.
మార్కెటింగ్ మాయాజాలం...
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో జరుగుతున్న మార్కెటింగ్ మాయాజాలం రైతులపాలిట శాపంగా మారుతోంది. అక్టోబర్ 25న కొనుగోళ్ల ప్రారంభంలో క్వింటాల్‌కు రూ. 7,970 ధర పలకింది. నవంబర్ 3 నాటికి గరిష్ఠంగా రూ.8,540 ధరను వ్యాపారులు చెల్లించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పటి నుంచి క్రమంగా వ్యాపారులు ధరలను దించేస్తున్నారు. అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గడం... వ్యాపారుల మాయాజాలంతో రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 4.86 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా సగటున రూ. 7,500 ధర లభించింది. డిమాండ్‌కు అనుగుణంగా ధర పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులు పోటీ పడాలంటే...
ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ వాణిజ్య కొనుగోళ్లు ప్రారంభిస్తే వ్యాపారులకు పోటీ ఏర్పడే అవకాశం ఉంది. జిల్లా ప్రజాప్రతినిధులు, యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్ల వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. ధాన్యంపై జరగుతున్న చర్చ పత్తి పంటపై జరగడం లేదని కర్షక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలు చెల్లిస్తున్నామంటున్న అధికారులు.. ఆ వివరాలను మార్కెట్‌యార్డులో ప్రదర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
"ప్రపంచ వ్యాప్తంగా ఆదిలాబాద్ పత్తికి మంచిపేరుందని చెప్పిన అధికారులే ఈ రోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రోజురోజుకీ ధరల తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారని రైతులం రోడ్డెక్కితే 40 రూపాయలు పెంచారు. అంటే రైతులు ధరను పెంచాలని ప్రతి రోజు రోడ్డెక్కాలా.. రైతుల పక్షాన ఉండిగిట్టుబాటు ధరలు పెట్టించాల్సిన అధికారులు ఎందుకు నిమ్నకునీరెత్తినట్లు ఉంటున్నారో అర్థం కావడంలేదు. డిమాండ్‌కు అనుగుణంగా ధర పెరగడం లేదు. అంతర్జాతీయ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ధరలు చెల్లిస్తున్నామంటున్న అధికారులు ఆ వివరాలను మార్కెట్‌యార్డులో ఎందుకు ప్రదర్శించడంలేదు."
-పత్తి రైతు
ఇవీ చదవండి :
Etela Jamuna Comments: గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారా?
Viral Video: కుమార్తె ముందే తండ్రిని కొట్టిన ఎస్సై.. నాన్నను ఏమనొద్దంటూ చిన్నారి రోదన