కొవిడ్ నిర్ధారణ పరీక్షలు మొదట్లో హైదరాబాద్‌లోనే ఆర్‌టీపీసీఆర్ విధానంలోనే చేసేవారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లాలో సేకరించిన నమూనాలను హైదరాబాద్‌కు పంపించగా.. పరీక్షల తర్వాత నివేదికలు వెల్లడించేవారు. అనంతరం రిమ్స్‌లో కొవిడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి సీబీ నాట్, ట్రూనాట్ యంత్రాలపై ఉమ్మడి జిల్లాలోని అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలకు నిర్ధారణ పరీక్షలు చేయటం ప్రారంభించారు. క్రమంగా కరోనా అనుమానితులు వరుస కట్టడంతో నమూనాల సేకరణ సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. దీంతో ఈ యంత్రాలపై ఆశించిన స్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేయటం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆగస్టులో ఆర్‌ఏటీ కిట్లు సరఫరా చేసింది. ఆగస్టు 15 నుంచి మండలాలు, కాలనీలు, ఆరోగ్యకేంద్రాల వారీగా అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేయటానికి మార్గం సుగమమైంది. వృద్ధులు, పిల్లలు, గర్భిణులకు నిర్ధారణ పరీక్షలు చేయటం ఆరంభమైంది. 104 అంబులెన్స్ వాహనాలను వినియోగించుకొని కాలనీలవారీగా అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. ఉన్నతాధికారులు సైతం ఆర్‌ఏటీ ద్వారా పరీక్షలు చేయటానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఈ కిట్ల ద్వారా ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు చేయటం ప్రారంభించారు.
- ఆదిలాబాద్ ఆర్‌ఏటీ పరీక్షలు చేయటంలో ముందంజలో ఉన్నా పాజిటివ్ కేసులు మాత్రం అతి తక్కువగా 4.80 శాతం మాత్రమే నమోదయ్యాయి.
- ఈ పరీక్షల్లో రెండో స్థానంలో ఉన్న మంచిర్యాల జిల్లా మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్యలో అత్యధికంగా 17.91 శాతంతో ముందు వరుసలో ఉంది.
- నిర్మల్ జిల్లాలో పాజిటివ్ కేసుల శాతం 13.16, కుమురంభీం జిల్లాలో 5.63 శాతం నమోదయ్యాయి.