Temperatures Dropped: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా 8 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతో చలి తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో శీతలగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక జారీచేసింది. రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి) గ్రామంలో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జనవరి చివరివారంలో ఈ స్థాయిలో తగ్గడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి. (రాష్ట్రంలో గత పదేళ్లలో జనవరి నెలలో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలు. 2018 జనవరి 26న ఆదిలాబాద్ పట్టణంలో నమోదైంది) ఆది, సోమవారాల్లో సైతం ఉష్ణోగ్రతలు ఇలానే పడిపోతాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. హిమాలయాల నుంచి శీతలగాలులు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు వీస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని, శీతాకాలంలో ఇది సహజమేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గాలిలో తేమ సాధారణంకన్నా 23 శాతం తక్కువగా నమోదవడంతో పొడి వాతావరణం ఉంది. ఉదయం పూట రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..
అర్లి(టి)తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా చలి తీవ్రంగా ఉంది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 5.7, కుమురం భీం జిల్లాలో 6.1, మంచిర్యాల జిల్లాలో 7.9, కవ్వాల్ అభయారణ్యం ప్రాంతంలో 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 8.7 డిగ్రీలకు పడిపోయింది.
ఇదీ చదవండి: